![tourism places in hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/17/4554.jpg.webp?itok=qOFdGmmv)
ఒకప్పుడు ప్రజలంతా చేదుడుబావి, మెట్ల బావుల నీటిని తాగేవారు. కాలక్రమంలో వాటిని పక్కన పెట్టి చెరువులు, వాగులు, బోర్లు, కులాయిల నీటిని తాగుతున్నారు. ఓ దేవాలయం ఉందంటే దానికి చుట్టుపక్కల ఓ బావిని తవ్వి కోనేరుగా వాడే వారు. కాల క్రమంలో వాటి నిర్వహణ భారం కావడం, ఆ నీటిని వాడకపోవడంతో అవన్నీ పూడుకుపోయాయి. అలాంటి మెట్ల బావుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటంతో పాటు వాటిని ఎన్నో జీవరాశులకు కేంద్రంగా మార్చేందుకు సాహే అనే ఎన్‌జీఓ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో బన్సీలాల్‌పేట మెట్ల బావిని పునరుద్ధరించి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రారంభించిన విషయం తెలిసిందే. – మణికొండ
బన్సీలాల్‌పేట మెట్ల బావి తరహాలోనే రాష్ట్రంలోని గచ్చిబౌలి, బైబిల్‌హౌస్, కోకాపేట, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మంచిరేవుల లాంటి 25 చోట్ల బావులను పునరుద్ధరించారు. పనికిరాని వాటిగా మరుగున పడిన వాటికి జీవం పోసి తిరిగి ఉపయోగంలోకి తేవటం, ఏకంగా వాటిని పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం అందరినీ ఆకర్షిస్తున్నాయి.
జీవరాశులకు ఉపయుక్తంగా..
వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడిన బావులను పునరుద్ధరిస్తే మరో వంద సంవత్సరాల పాటు ప్రజలకు జీవరాశులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేపడుతున్న పనులు మన్ననలు పొందుతున్నాయి. బావులను పునురుద్ధరించడంతో పాటు వాటి చుట్టూరా లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తుండటంతో వాటి వద్ద గడిపేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, చెరువులు, కాలువలు, నదులను పునరుద్ధరించి, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సాహే సంస్థ 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అదే క్రమంలో ఇలాంటి మూతబడిన బావులను పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు సలహా ఇవ్వడంతో వాటి పునరుద్ధరణ పనులను గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్నారు. అందులో భాగంగా 25వ బావిగా మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న బావిని పునరుద్ధరించారు. దేవాలయానికి ఆగ్నేయంలో వాస్తుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని గతంలో పూర్తిగా పూడ్చివేశారు.
సాహే ప్రతినిధులు అలాంటి బావుల విశిష్టతను తెలపడంతో తిరిగి తెరిచేందుకు ఆలయ పూజారులు అంగీకరించటంతో నెల రోజులుగా శ్రమించి పునరుద్ధరించారు. దానిని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు చుట్టూరా గోడకట్టడం, లైటింగ్, పార్కు ఏర్పాటు పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులన్నింటికీ రూ.38 లక్షలను వెచి్చస్తున్నారు. కామారెడ్డిలోనూ మరో బావిని, చందానగర్‌లోని భక్షికుంట బావిని పునరుద్ధరించే పనులను చేపడుతున్నారు.
జల భాండాగారాలుగా..
పురాతన బావులను పునరుద్ధరిస్తే దాని కేంద్రంగా అనేక జీవరాశులు జీవనం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిని కాస్త తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. వాటిల్లో చెత్తా చెదారం వేసి మూసివేసి నిరుపయోగంగా మార్చారు. ఒక్క బావి ఉంటే దాని చుట్టుపక్కల భూగర్భ జలం పెరుగుతుంది. దీంతో ప్రజలు నీటి బాదల నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బావులు ఎక్కడ ఉన్నా వాటిని పునరుద్ధరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌గా తీసుకుంటున్నాం.
– కల్పన రమేష్ సాహే సంస్థ నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment