Pluto
-
ఈ మిస్టరీ ప్లానెట్‌పై కొత్త ఆశలు!
కొన్నాళ్లు నవగ్రహాల్లో ఒకటన్నారు! మరికొన్నాళ్లు అసలు గ్రహానివే కాదు పొమ్మన్నారు! తాజాగా మళ్లీ గ్రహం హోదా పరిశీలిస్తామంటున్నారు! ఈ మిస్టరీ ప్లానెట్‌పై ఐస్ వోల్కనోలు గుర్తించడంతో ప్లూటోకు పునరుజ్జీవం పోస్తున్నారు సైంటిస్టులు. సౌరకుటుంబంలోని చిన్నారి గ్రహం (?) ప్లూటో మనిషికి అంతుచిక్కడం లేదు. సూర్యుడికి సుదూరంగా ఉండే ప్లూటోను కనుగొని 92 సంవత్సరాలవుతోంది. దీన్ని కనుగొన్న తర్వాత చాలా సంవత్సరాలు నవగ్రహాల్లో ఒకటిగా లెక్కించారు. 16ఏళ్ల క్రితం కొత్త లెక్కలేసి దీని గ్రహహోదాను తీసిపారేశారు. ఇప్పుడు అదే సైంటిస్టులు ప్లూటో ఉపరితలంపై మంచు పర్వతాల జాడలున్నాయని చెబుతున్నారు. సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహంలో కూడా ఇలాంటి మంచు వోల్కనోలు లేవు. దీంతో ఒక్కమారుగా ఖగోళ పరిశోధకుల దృష్టి ప్లూటోపైకి మరలింది. న్యూహారిజాన్స్ మిషన్ పంపిన చిత్రాలను విశ్లేషించిన సైంటిస్టుల బృందం ప్లూటోపై కొండలు, గుట్టలు మరియు పెద్ద గోపురాల్లాంటి ఆకారాలున్న ప్రాంతాన్ని గుర్తించింది. ఇవన్నీ ప్లూటో ఉపరితల అంతర్భాగం నుంచి విరజిమ్మిన మంచు తదితర పదార్ధాలతో ఏర్పడ్డాయని గమనించింది. ఇలాంటి భారీ నిర్మితీయ ప్రాంతాలు ఏర్పడాలంటే పలుమార్లు మంచు పర్వతాల విస్ఫోటనం జరిగి ఉండాలని అంచనా వేసింది. తమ తాజా పరిశోధన వివరాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించింది. ప్లూటో ఉపరితలానికి కింద దాదాపు 100– 200 కిలోమీటర్ల దిగువన నీటితో నిండిన సముద్రం ఉండి ఉండొచ్చని పరిశోధనలో పేర్కొన్నారు. ఉపరితలంపై ఉన్న పర్వతాల ఏర్పాటుకు అవసరమైన మంచుకు ఈ సముద్రమే ఆధారమని అంచనా వేస్తున్నారు. క్రయో వోల్కనోలు సాధారణంగా లావా వెదజల్లే అగ్నిపర్వతాన్ని వోల్కనో అంటారు. కానీ మంచును వెదజల్లే పర్వతాలను క్రయో వోల్కనోలు లేదా ఐస్ వోల్కనోలంటారు. రైట్ మోన్స్ మరియు పిక్కార్డ్ మోన్ అనే రెండు అతిపెద్ద మట్టి దిబ్బల ప్రాంతాన్ని ప్లూటోపై న్యూహారిజన్స్ మిషన్ ఫొటో తీసింది. ఈ మట్టి దిబ్బలు క్రయోవోల్కనోలని పరిశోధక బృందం ప్రస్తుతం నమ్ముతోంది. అలాగే ప్లూటో నైరుతి ప్రాంతంలో కనిపించే ప్రకాశవంతమైన ప్రాంతాన్ని (స్పుత్నిక్ ప్లానిటియా అంటారు) బృందం విశ్లేషించింది. ఇక్కడ 1–7 కిలోమీటర్ల ఎత్తున 30– 100 కిలోమీటర్ల వెడల్పున వ్యాపించిన భారీ దిబ్బలున్నాయని తెలిపింది. ఇవి కేవలం ప్లూటోపైనే కనిపించాయని, ఇవి క్రయో వోల్కనోలు వెదజల్లిన మంచుతో ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్ కెల్సి సింగర్ చెప్పారు. ఇలాంటి దిబ్బల్లో కొన్నింటి వయసు తక్కువ కావడంతో ఇటీవల కాలం (అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం) వరకు కూడా ప్లూటోలో ఐస్ వోల్కనోలు పేలి మంచు వెదజల్లడం జరిగి ఉండొచ్చన్నారు. అయితే ఈ వోల్కనోలు పేలడానికి అవసరమైన వేడి ప్లూటోకి ఎక్కడినుంచి వచ్చిందనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. అలాగే ఈ వాతావరణం జీవి పుట్టుకకు కొంతమేర అనువుగానే ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. ప్లూటో పరిశోధనకు న్యూహారిజన్స్ మిషన్‌ను నాసా 2006లో ప్రయోగించింది. అదే సంవత్సరం ప్లూటోకు గ్రహహోదా తీసివేశారు. 2015లో ఈ మిషన్ ప్లూటోను చేరింది. అప్పటినుంచి ప్లూటోకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని పంపుతోంది. తాజా పరిశోధనలకు మరిన్ని ఆధారాలు లభిస్తే తిరిగి సౌర కుటుంబంలో ప్లూటోకు గ్రహ హోదా కల్పించే అవకాశాలున్నాయి. మరిన్ని విశేషాలు.. ► 1930లో కుపర్ బెల్ట్ (నెప్ట్యూన్ చుట్టూ ఉండే శకలాలు)లో ప్లూటోను కనుగొన్నారు. అప్పుడే దీన్ని తొమ్మిదో గ్రహంగా ప్రకటించారు. ► 1990ల్లో తొలిసారి ప్లూటో గ్రహ హోదాపై ప్రశ్నలు తలెత్తాయి. ► 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ యూనియన్ ప్లూటో గ్రహం కాదని, డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) అని ప్రకటించింది. ► భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలో మూడోవంతుండే ప్లూటో ఉపరితలం మీద ఐస్, రాళ్లు ఉన్నాయి. ► ప్లూటోకి ఐదు చందమామలున్నాయి. ► సూర్యుడికి దూరంగా ఉండడంతో దీనిపై ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అదిగదిగో ప్లానెట్ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా
మన సౌర కుటుంబంలో గ్రహాలెన్ని? ఇదేం ప్రశ్న తొమ్మిది గ్రహాలు కదా అంటారా.. కాదు కాదు.. ఫ్లూటోను లిస్టులోంచి తీసేశారు కాబట్టి ఎనిమిదే అంటారా.. ఏం అన్నా అనకున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఫ్లూటో కాకుండానే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫ్లూటో అవతల ఓ పెద్ద గ్రహం ఉందనడానికి కొన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, కానీ దాని జాడ మాత్రం కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలేమో.. అలాంటి గ్రహమేదీ లేకపోవచ్చని చెప్తున్నారు. అసలు ఈ తొమ్మిదో గ్రహం ఏమిటి? దానికి ఆధారాలేమిటి? ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? ఫ్లూటోను తొలగించాక.. మనం చిన్నప్పటి నుంచీ సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయనే చదువుకున్నాం. కానీ కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు.. గ్రహాలకు సంబంధించి కొన్ని పరిమాణం, ఆకృతి, దాని కక్ష్య వంటి పలు నిబంధనలు రూపొందించారు. అందులో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ప్లూటో అప్పటి నుంచి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్) మాత్రమే మిగిలాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఫ్లూటోకు కొంచెం అటూఇటూగా మరో మూడు, నాలుగు మరుగుజ్జు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ఇటీవల ఫ్లూటో, ఇతర మరుగుజ్జు గ్రహాలు కాకుండానే.. తొమ్మిదో గ్రహం ఉండి ఉంటుందన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. ‘ప్లానెట్ 9’ ఉందంటూ.. 2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)కు చెందిన అంతరిక్ష పరిశోధకులు మైక్ బ్రౌన్, కోన్స్టాంటిన్ బటిగిన్ ‘ప్లానెట్ 9’ను ప్రతిపాదించారు. ఫ్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఓ భారీ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ‘ప్లానెట్ 9’ అని పేరు పెట్టారు. ►2018లో ది ఆస్ట్రానమికల్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా సౌర కుటుంబం అంచుల్లో ఏదో పెద్ద గ్రహం ఉండవచ్చని అంచనా వేసింది. ‘2015 బీపీ519’గా పిలిచే ఓ భారీ ఆస్టరాయిడ్ కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. నెప్ట్యూన్ కక్ష్యకు సమీపంగా సూర్యుడి చుట్టూ తిరిగి వెళుతుంది. అంత దూరంలో భారీ గ్రహం ఉందని, దాని ఆకర్షణ వల్లే ఈ ఆస్టరాయిడ్ సౌర కుటుంబం పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. భారీ గ్రహాల గురుత్వాకర్షణను బట్టి.. అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉండే గ్రహాలు, ఆస్టరాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువులపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైన గురుడి గురుత్వాకర్షణ కారణంగానే.. ఆ గ్రహ కక్ష్యలో, అంగారకుడు–గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతుంటాయి. అదే తరహాలో క్యూపియర్ బెల్ట్‌లోనూ ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం చూపితే తప్ప.. ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు అలా వ్యవహరించవని సూత్రీకరించారు. ►మార్స్–గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉన్నట్టుగానే.. నెప్ట్యూన్ గ్రహం పరిభ్రమించే చోటు నుంచి అవతల సుమారు 500 కోట్ల కిలోమీటర్ల వెడల్పున మరో బెల్ట్ ఉంటుంది. దానినే క్యూపియర్ బెల్ట్ అంటారు. ప్లూటోతోపాటు ఎన్నో మరుగుజ్జు గ్రహాలు, కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఆ బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి. ఆ గ్రహం ఎలా ఉండొచ్చు? క్యూపియర్ బెల్ట్‌లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, కక్ష్య, పరిమాణాలను బట్టి.. పలు కంప్యూటర్ సిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ‘ప్లానెట్ 9’ అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ లెక్కన.. భూమి ప్లానెట్ 9 ►భూమితో పోలిస్తే ప్లానెట్ 9 పది రెట్లు పెద్దగా ఉండి ఉంటుంది. ►సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఎంతదూరంలో ఉందో.. అంతకు 20 రెట్లు దూరంలో తిరుగుతూ ఉంటుంది. ►ప్లానెట్–9 సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు కనీసం 10 వేల ఏళ్ల నుంచి 20 వేల ఏళ్లకుపైగా సమయం పడుతుంది. నేరుగా ఎందుకు గుర్తించలేం? సౌర కుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్లు పరిభ్రమించే వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా సూర్యుడి చుట్టూ తిరిగేందుకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.అందువల్ల వాటిని నేరుగా గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే.. వాటి పరిమాణం, వేగం, ఇతర అంశాలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు ప్లానెట్ 9 ►సౌర కుటుంబం చివరిలో ఉన్న నెప్ట్యూన్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 165 ఏళ్లు పడుతుంది. అదే ప్లూటోకు 248 ఏళ్లు, దాని అవతల ఉన్న మరుగుజ్జు గ్రహం ఎరిస్కు 558 ఏళ్లు, సెడ్నాకు 11,408 ఏళ్లు పడుతుంది. భిన్న వాదన కూడా ఉంది క్యూపియర్ బెల్ట్‌లోని కొన్ని మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల కక్ష్య, ఇతర అంశాలు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని.. అక్కడ భారీ గ్రహం ఉండకపోవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ హోల్ అయితే? సౌర కుటుంబం ఆవల భారీ గ్రహం కాకుండా.. చిన్న స్థాయి బ్లాక్‌హోల్ ఉండి ఉండొచ్చని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆ బ్లాక్‌హోల్ ప్రభావం వల్లే కొన్ని ఆస్టరాయిడ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని 2020లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రం వెలువరించారు. ఖగోళ వస్తువులను ఇన్ఫ్రారెడ్ తరంగాల ద్వారా కాకుండా.. ఎక్స్‌రే, గామా కిరణాల ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని సూచించారు. -
రెడ్ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే
వాషింగ్టన్: న్యూహారిజన్స్ అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను గురువారం నాసాకు పంపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్ ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా జనవరి 1న అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ను పంపిన సంగతి తెలిసిందే. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు. న్యూహారిజన్స్ అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్ హాఫ్కిన్స్ వర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) ట్వీట్ చేసింది. తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీ. సమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది. రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. -
సౌర కుటుంబంలో ఇంకో బుల్లి గ్రహం..
సౌర కుటుంబం గురించి మనకంతా తెలుసు అనుకుంటున్నాం గానీ.. దీంట్లో ప్లూటోకు ఆవల ఇంకో బుల్లి గ్రహం ఉన్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. 2015టీజీ387 అని పిలుస్తున్న ఈ డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) వ్యాసం కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన జాబిల్లి కంటే పదిరెట్లు చిన్నదన్నమాట. అయితే ఈ బుల్లిగ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం మాత్రం ఏకంగా 40 వేల ఏళ్లు! సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది గరిష్టంగా 2300 అస్ట్రనామికల్ యూనిట్స్ దూరం (భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం ఒక అస్ట్రనామికల్ యూనిట్) వెళుతుందని దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డేవిడ్ థోలెన్ తెలిపారు. సౌరకుటుంబం అంచుల్లో ఇలాంటి మరుగుజ్జు గ్రహాలు ఇంకా బోలెడన్ని ఉండే అవకాశముందని, వాటి సైజు, తిరిగే దూరాలను పరిగణలోకి తీసుకుంటే చాలావాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని డేవిడ్ వివరించారు. మూడేళ్ల క్రితం ఈ మరుగుజ్జు గ్రహం దాదాపు 65 అస్ట్రనామికల్ యూనిట్స్ సమీపానికి రావడం వల్ల గుర్తించడం వీలైందని అంచనా. ఈ గ్రహ కక్ష్యను కంప్యూటర్ల ద్వారా కృత్రిమంగా సృష్టించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్న ప్లానెట్ ‘ఎక్స్’ ఇదే కావచ్చునన్న అంచనా కలుగుతుందని డేవిడ్ వివరించారు. -
ప్లూటోను గ్రహంగా గుర్తించండి
వాషింగ్టన్: నవగ్రహాల్లో ఒకటిగా ఉండి.. 2006లో గ్రహ హోదాను కోల్పోయిన ప్లూటోను మళ్లీ గ్రహంగా గుర్తించాలని ఆరేళ్ల చిన్నారి నాసాకు లేఖ రాసింది. వివరాల్లోకెళ్తే... ఐర్లాండ్‌కు చెందిన కారా ఒ కానర్ అనే ఆరేళ్ల బాలిక నుంచి నాసాకు ఓ లేఖ వచ్చింది. దాంట్లో.. ‘నేను ఒక సాంగ్ విన్నా.. దానిలో గ్రహాల జాబితాలో ప్లూటో చివరి వరుసలో ఉంది. క్యూపర్ బెల్ట్‌లోని నెప్యూట్ పక్కన ప్లూటో ఉంటుందనే విషయం నాకు తెలుసు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జుపిటర్ వరుసలో ప్లూటో కూడా ఉండాలి. మరుగుజ్జుదంటూ దానిని తొలగించడానికి వీల్లేదు. వెనే గ్రహాల లిస్టులో ప్లూలోను కూడా చేర్చండి. ఏ గ్రహం మరుగుజ్జుది కాదు. భవిష్యత్తులో నేను కూడా ఆస్ట్రోనాట్‌ను కావాలనుకుంటున్నాన’ని పేర్కొంది. కానర్ లేఖకు నాసా డైరెక్టర్ స్పందిస్తూ... ‘నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పిన దానితో నేనూ ఏకిభవిస్తున్నాను. కానీ ఈ ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ప్రతీది మారుతూ ఉంటుంది. ప్లూటో మరుగుజ్జు గ్రహమా కాదా అనేది పక్కనబెడితే దానిపై పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. భవిష్యత్తులో నువ్వు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టగలవనే నమ్మకం నాకుంది. అయితే అప్పటిదాకా నువ్వు చాలా బాగా చదువుకోవాలి. త్వరలో నాసాలో నిన్ను చూస్తానని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. -
పర్వతాలకు పేర్లు.. టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీ
వాషింగ్టన్ : సౌర కక్ష్యలో సుదూరంగా తిరిగి ప్లూటో గ్రహంలోని పర్వతాలకు ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్వే పేర్లను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (ఐఏయూ) పెట్టింది. చీకటి గ్రహంగా పేరొందిన ప్లూటోలోని కొన్ని భౌగోళిక ప్రాంతాలకు పేర్లు పెట్టడం ఇదో మొదలు. ప్లూటో గ్రహంలోని భౌగోళిక అంశాలకు పేర్లు పెట్టాలని నిర్ణయానికి వచ్చిన తరువాత అనేక రకాల పేర్లు పరిశీలనకు వచ్చాయరని.. అయితే ఎవరెస్ట్ శిఖారాన్ని తొలిసారి అధిరోహించిన టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీల పేర్లు పెట్టాలని ఐఏయూ నిర్ణయం తీసుకుంది. -
ప్లూటోకు ‘చందమామ’ రక్ష!
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహమైన ప్లూటోపై ఉన్న వాతావరణం తరిగిపోకుండా దాని ఉపగ్రహం(చందమామ) కారన్ కాపాడుతోందని తాజా పరిశోధనలో తేలింది. ప్లూటో చుట్టూ కవచాన్ని ఏర్పరచి సౌర పవనాలను దానికి దూరంగా దారి మళ్లిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్లూటో, కారన్‌కు మధ్య ఉన్న సంబంధం.. అలాగే సౌర పవనాల నుంచి కారన్ ఎలా కాపాడుతోందన్న దానిపై లోతైన అధ్యయనం చేశారు. ప్లూటో వ్యాసార్థం కన్నా ఎక్కువ పరిమాణంలో ఉండే కారన్ కేవలం 19,312 కిలోమీటర్ల దూరం నుంచే పరిభ్రమిస్తుంది. సూర్యుడికి, ప్లూటోకు మధ్య వచ్చినపుడు కారన్ అక్కడి వాతావరణాన్ని కాపాడుతుందని పరిశోధన చెబుతోంది. కారన్‌కు సొంత వాతావరణమంటూ ఏదీ లేదని, అయితే అది ఏర్పడ్డపుడు ప్లూటో చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచి, సౌరపవనాల నుంచి ప్లూటోను కాపాడుతుందని జార్జియా టెక్ అసోసియేట్ ప్రొఫెసర్ కారోల్ పాటీ వివరించారు. న్యూ హరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించి, భూమిపైకి పంపిన విషయాల ఆధారంగా పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
ప్లూటో ఉపగ్రహంపై మంచుగడ్డలు
వాషింగ్టన్: ప్లూటోకు ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన హైడ్రాపై మంచుగడ్డలు పేరుకుపోయినట్లు నాసా అంతరిక్ష వాహకనౌక పంపిన సమాచారం ద్వారా తెలిసింది. తొలిసారిగా ఈ వాహకనౌక ప్లూటో ఉపగ్రహాల గురించి సమాచారాన్ని పంపింది. ప్లూటో ఉపగ్రహాల్లో అతి పెద్దదైన చరోన్‌పై కూడా మంచు గడ్డలు పేరుకుపోయాయి. అయితే చరోన్ కన్నా హైడ్రాకు మంచు నీటిని శోషించుకునే సామర్థ్యం ఎక్కువ. అందువల్ల చరోన్ కన్నా హైడ్రాపై ఉన్న మంచు రేణువులు పెద్దవనీ, కొన్ని కోణాల్లో ఎక్కువ కాంతిని పరావర్తనం చెందిస్తాయని శాస్త్రవేత్తలంటున్నారు. -
ఫ్లూటోకి ఆవల మరో గ్రహం!
సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఫ్లూటోని చిట్టచివరి గ్రహంగా ఇంతవరకు పరిగణిస్తున్నాం.. కాని అది సరికాదని ఫ్లూటోకి ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు గల గ్రహాన్ని కనుగొన్నామని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఆవహించి ఉందన్నారు. దీని ద్రవ్యరాశి భూమి కంటే 10 రెట్లు అధికంగా, ఫ్లూటో కంటే 4,500 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఈ గ్రహానికి 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందన్నారు. -
ప్లూటోపై రంగులు!
వాషింగ్టన్: ప్లూటోతోపాటు దాని ఉపగ్రహం చరోన్‌పై వివిధ రంగులతో కూడిన వలయాలున్నట్లు నాసా గుర్తించింది. ‘ప్లూటో టైమ్’ పేరుతో సామాజిక మాధ్యమంలో నాసా నడిపిన ఉద్యమానికి 7 వేల మంది తాము సేకరించిన చిత్రాలను పంపించారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చిన నాసా.. అసలు చిత్రాలను, ప్లూటోపై ఉన్న రంగుల వలయాలు, ఇందుకు కారణాలను వివరించింది. ప్లూటో గ్రహం సూర్యునికి చాలా దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మధ్యాహ్నం పడే సూర్యరశ్మి.. ఉదయం, సాయంత్రం భూమిపై పడే సూర్యుని వెలుతురుతో సమానం. అత్యంత దూరంలో ఉన్న ప్లూటోపైకి సూర్యుని కిరణాలు చేరుకునే క్రమంలో తీవ్రతలో మార్పు కారణంగా వలయాలు కనిపిస్తున్నాయని.. సంధ్యాసమయంలో భూ వాతావరణంలోనూ అలాంటి వలయాలు కనిపిస్తాయని కొందరు పరిశోధకులు నాసాకు పంపిన సమాధానాల్లో పేర్కొన్నారు. -
పాముచర్మం ఆకృతిలో పర్వతాలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన న్యూహారిజాన్స్ వ్యోమనౌక ప్లూటో గ్రహానికి సంబంధించి తాజాగా పంపిన అత్యధిక రెజల్యూషన్‌తో కూడిన చిత్రాలు ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్లూటోపై పర్వతాలు పాము చర్మం ఆకృతిలో ఉన్నట్లు నాసా తెలిపింది. దీంతో పాటు చిత్రమైన ఆకారాల్లో నీలం-గోధుమ రంగుల్లో మిట్టలు ఉన్నట్లు ఈ కలర్ ఫొటో స్పష్టం చేస్తోందని 'న్యూహారిజాన్స్ జియోలజీ, జియోఫిజిక్స్ అండ్ ఇమేజింగ్' బృందానికి డిప్యూటి హెడ్ అయిన విలియమ్ మెకినన్ తెలిపారు. మల్టీస్పెక్ట్రల్ విజువల్ ఇమేజింగ్ కెమెరా(ఎంవీఐసీ) ద్వారా సుమారు 530 కిలోమీటర్ల మేర ప్లూటో ఉపరితల ప్రాంతాన్ని జూలై 14న న్యూహారిజాన్స్ వ్యోమనౌక చిత్రించిందని చెప్పారు. దీంతో పాటు లాంగ్ రేంజ్ రీకనెసైన్స్ ఇమేజర్(ఎల్ఓఆర్ఆర్ఐ) ద్వారా తీసిన చిత్రం సెప్టెంబర్ 20న భూమికి చేరిందని, ప్లూటో భౌగోళిక వివరాలు ఇది స్పష్టం చేస్తోందని వివరించారు. -
ప్లూటోపై మంచు కొండలు!
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయని న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు పర్వతాలుగా భావించవచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లూటోపై మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చని, వీటిని బట్టి చూస్తే ప్లూటో ఇంకా భౌగోళికంగా క్రియాశీలంగానే ఉండవచ్చన్నారు. ప్లూటోను సమీపించకముందు న్యూ హారిజాన్స్ మంగళవారం 77 వేల కి.మీ. దూరం నుంచి ఈ మంచుకొండలను క్లోజ్-అప్ ఫొటో తీసిందని పేర్కొన్నారు. -
ప్లూటోను దాటి.. ఫోన్ చేసింది!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక మంగళవారం ప్లూటో మరుగుజ్జు గ్రహాన్ని అతిసమీపం నుంచి దాటివెళ్లిన అనంతరం 13 గంటలకు భూమికి ఫోన్ చేసింది! ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్‌కాల్‌ను న్యూ హారిజాన్స్ ప్రసారం చేసిందని బుధవారం నాసా వెల్లడించింది. సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ మంగళవారం ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటి వెళ్లడం, మానవ నిర్మిత మైన ఒక వ్యోమనౌక ప్లూటో సమీపంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం తెలిసిందే. ఆటోమోడ్లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. ప్లూటోను సమీపించిన సమయంలో యాంటెన్నాలను ఈ వ్యోమనౌక అటువైపుగా తిప్పుకొన్నందున భూమితో 21 గంటల పాటు సంబంధాలు తెగిపోయి ఉత్కంఠకు గురిచేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కూపర్‌బెల్ట్‌లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోందని, ఆ సమాచారమంతా భూమికి పంపేందుకు 16 నెలలు పడుతుందని తెలిపారు. -
ప్లూటో గుట్టు విప్పనుంది..
అంగారకుడిపై పరిశోధనల కోసం రోదసిలో దూసుకుపోతున్న మన మంగళ్యాన్(మామ్) ఉపగ్రహం మాదిరిగానే.. ప్లూటోపై పరిశోధనలకు బయలుదేరిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘న్యూ హారిజోన్స్’ వ్యోమనౌక ఇది. సౌరకుటుంబం చిట్టచివరలో మంచు, ఖగోళ శకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో ఉన్న మరుగుజ్జు గ్రహం ప్లూటో గుట్టు విప్పేం దుకు ఇది 2006 నుంచి ప్రయాణం సాగిస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. వచ్చే ఏడాది జూలై 14న ఈ వ్యోమనౌక ప్లూటోకు 10 వేల కిలోమీటర్ల సమీపానికి చేరుకుంటుందని నాసా ప్రకటించింది. హబుల్ లాంటి శక్తిమంతమైన టెలిస్కోపుతో నిఘా పెట్టినా.. కూపర్‌బెల్ట్ ప్రాంతంలోని క్లిష్ట పరిస్థితుల వల్ల ప్లూటో గురించి ఇంతవరకూ తెలిసింది చాలా తక్కువే. ఈ వ్యోమనౌక ప్లూటోకు సమీపంలోకి చేరితేనే.. ఇక ఆ గ్రహం కచ్చితమైన ఆకారం, రంగులు, వలయాలు, మంచు, పర్వతాలు, లోయల వంటివాటి గురించిన గుట్టు వీడనుందని భావిస్తున్నారు.