చిలమత్తూరు (అనంతపురం) : బెల్టుషాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, వెంటనే వాటిని అరికట్టాలని టీడీపీకి చెందిన ఎంపీపీతో సహా ఐదుగురు సర్పంచులు మంగళవారం ఎక్సైజ్ అధికారులకు విన్నవించారు. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజవర్గంలో ఉన్న చిలమత్తూరు మండలంలోని 83 గ్రామాల్లో దాదాపు 210 బెల్టు షాపులు నడుస్తున్నాయని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ చాగలేరు, కోడికొండ, శెట్టిపల్లి, కోడూరు సర్పంచులతో కలసి ఎంపీపీ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచ్చలవిడి మద్యం అమ్మకాలు అరికట్టాలని వారు కోరారు.