చేరి సీటు వదులుకుంటే రూ.5 లక్షలు | Involved in the left seat of Rs 5 lakh | Sakshi
Sakshi News home page

చేరి సీటు వదులుకుంటే రూ.5 లక్షలు

Published Sun, Jul 26 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

చేరి సీటు వదులుకుంటే రూ.5 లక్షలు

చేరి సీటు వదులుకుంటే రూ.5 లక్షలు

ఎం-సెట్ టాప్ ర్యాంకర్లకు ప్రైవేటు వైద్య కాలేజీల గాలం

సాక్షి, హైదరాబాద్: యాజమాన్య కోటా సీట్లను అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యవిద్యా కళాశాలలు మరో మార్గం పట్టాయి. ప్రైవేటు ఎం-సెట్ పరీక్ష కారణంగా యాజమాన్య కోటా సీట్లను ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకోవడానికి వీలులేకపోవడంతో.. ఈ పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.ప్రత్యేక కౌన్సెలింగ్‌లో తమ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు తీసుకొని ఆ తర్వాత వాటిని వదిలేసుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నాయి.

అదే దంతవైద్య సీటుకు రూ.లక్ష వరకు ఇవ్వజూపుతున్నాయి. టాప్ ర్యాంకు సాధించినా.. యాజమాన్య కోటా సీట్ల ఫీజు చెల్లించే స్థాయిలేని వారిని లక్ష్యంగా చేసుకొని ప్రైవేటు వైద్య కాలేజీలు ఈ కుట్రకు వ్యూహం పన్నాయి. ఇలా వదిలేసిన సీట్లు ఎన్నారై కోటా కిందకు వెళ్లగానే.. ఒక్కో సీటును రూ.కోటిన్నర వరకు అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ మేరకు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీలు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.
 
తొలి నుంచీ అక్రమాలే..
ప్రైవేటు వైద్య కాలేజీల యాజమాన్యాలు మొదటి నుంచీ అక్రమాల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక రచించాయి. 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు జరిగిన ప్రత్యేక ఎం-సెట్ విషయంలో నోటిఫికేషన్ దగ్గర నుంచీ ప్రత్యేక ప్రవేశపరీక్ష వరకు అక్రమాలకు పాల్పడ్డాయి. అయినా పలువురు సాధారణ విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడంతో ‘ప్రలోభాల’ మార్గం పట్టాయి. అసలు గత నెలలో జరిగిన ప్రైవేటు ఎం-సెట్ పరీక్షకు 5,130 మంది హాజరుకాగా.. 2,266 మంది ర్యాంకులను ప్రకటించారు.

అందులో పలువురు పేద విద్యార్థులు కూడా టాప్ ర్యాంకు సాధించారు. మరికొందరు వచ్చే ఏడాది ప్రభుత్వ సీటుకు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివారిలో చాలా మందికి యాజమాన్య కోటా కింద ఏడాదికి రూ.9లక్షల చొప్పున చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అవకాశంగా తీసుకుని.. వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నాయి. ‘మీరు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున సీటు కొనడం కష్టం.

మీ విద్యార్థి ఈ ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటే వచ్చే ఏడాది ప్రభుత్వ సీటు సాధిస్తాడు. కాబట్టి వచ్చిన ఈ సీటులో చేరి... తర్వాత దాన్ని వదులుకోండి. మీకు రూ.5లక్షలు ఇస్తాం. ఆ డబ్బుతో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇచ్చి చదివించండి..’ అంటూ ప్రలోభపెడుతున్నాయి. ఇందుకోసం ప్రతీ ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
 
ఒక్కో సీటు రూ.కోటిన్నరకు..
టాప్ ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు యాజమాన్య కోటా సీటుకు ఫీజు చెల్లించలేక వాటిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. అటువంటి వారితో ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు మంతనాలు జరుపుతున్నాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు పొంది, తర్వాత విద్యార్థి ఆ సీటు వదులుకుంటే నిబంధనల ప్రకారం అది ఎన్నారై కోటా కిందికి వెళుతుంది. దానిని ఏ ప్రవేశపరీక్ష రాయని డబ్బున్న విద్యార్థులకు కూడా రూ. కోట్లకు అమ్ముకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ సీటును రూ.కోటిన్నరకు కూడా కొనేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డెంటల్ సీటును కూడా రూ.లక్షల్లో అమ్ముకునేందుకు కాలేజీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement