
కేసీఆర్ సర్కారుపై పోరాడండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో అన్నారు. బుధవారం టీటీడీపీ నాయకులతో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై పోరాడాలని వీరికి సూచించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తలపెట్టిన ఆందోళనల మీద విస్తృతంగా చర్చ జరిగింది.
వచ్చే నెల 12న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ విస్తృత సమావేశం నిర్వహించాలని, అన్ని స్థాయిల్లో కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసి, ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్న ఆరోపణలను టీటీడీపీ నేతలు బాబు దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన, కేసీఆర్ ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, ఎన్టీఆర్ హైదరాబాద్‌కు ఉదయం నిద్రలేవడం నేర్పారని చేసిన వ్యాఖ్యలనూ ఇదే రీతిలో వివాదం చేశారని, తాను మాట్లాడిన మాటల్లో తప్పేముందని పేర్కొన్నట్లు సమాచారం.
హైదరాబాద్ అభివృద్ధిలో అసలు కేసీఆర్ పాత్ర ఏముందని కూడా బాబు ప్రశ్నించినట్లు తెలిసింది. తెలుగుదేశం పాలనలోనే తెలంగాణలో వివిధ దశల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్లు ఊడ్పించడం తన హయాంలోనే మొదలైందని అన్నట్లు సమాచారం. కాగా, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభా స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలిపోతుందని, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా బాబు అభిప్రాయ పడినట్లు తెలిసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి తదితరులు భేటీలో పాల్గొన్నారు.