కన్న కూతురినే అమ్మకానికి పెట్టాడో తండ్రి. అయితే, ఆ బాలిక తండ్రి ప్రయత్నం నుంచి తప్పించుకుంది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లి మండలానికి చెందిన సాయిలు కొన్ని రోజులుగా జన్నారంలోని పొన్క్‌ల్ శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి కూతురు భవాని(7) ఉంది. సాయిలు ఇనుప సామాను, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవిస్తుండగా.. కూతురు భిక్షాటన చేస్తోంది. శనివారం రాత్రి సాయిలు తన కూతురిని అమ్మడం కోసం కొందరిని పిలిపించాడు.
గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు భవానిని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇది గమనించిన భవాని వారి కళ్లు గప్పి తప్పించుకుని పారిపోయింది. పొన్కల్ పంచాయతీ కార్యాలయం వెనుకాల 12గంటల ప్రాంతంలో కేకలు వేయగా... అది విని లింగంపల్లి రాజలింగు అనే వ్యక్తి ఆమెను కాపాడారు. తర్వాత పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఐసీడీఎస్ అధికారులు రాకపోగా... మంగళవారం వస్తామని చెప్పడం గమనార్హం. దీంతో భవానిప్రస్తుతం రాజలింగు ఇంట్లోనే ఉంది.