ఆ శకలం బోయింగ్‌దే!
హిందూ మహాసముద్రంలో దొరికిన శకలంపై మలేసియా
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని మలేసియా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో ఏడాది కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన బోయింగ్ రకానికి చెందిన ఎమ్‌హెచ్ 370 విమానానికి సంబంధించిన శకలం అదేనని అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలోని రినియన్ ద్వీపం వద్ద దొరికిన విమాన శకలం బోయింగ్ 777 రకానికి చెందినదేనని మలేసియా ఉప రవాణా మంత్రి అబ్దుల్ అజీజ్ తెలిపారు.
ఎమ్‌హెచ్ 370 విమానం ఆచూకీపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారికి కూడా ఈ విషయం తెలిపామన్నారు. రినియన్ ద్వీపానికి ఒక బృందాన్ని పంపుతామని, ఆ శకలం ఎమ్‌హెచ్ 370కి సంబంధించినదా... కాదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకైతే ఆ శకలం ఎమ్‌హెచ్ 370 దేనని నిర్ధారణ కాలేదన్నారు. విమాన ఆచూకీపై ఫ్రాన్స్ సంస్థతో తాము సేకరించిన సమాచారం పంచుకుంటామని చెప్పారు. మరింత కచ్చితమైన ఆధారాలు లభించకుండా దొరికిన శకలం ఎమ్‌హెచ్ 370 దేనని చెప్పడం తొందరపాటు చర్య అవుతుందన్నారు. మరోవైపు దొరికిన శకలంపై ఉన్న 637 బీబీ నంబర్.. బోయింగ్ విమానానిదేనని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్‌హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు.