
మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో త్వరలోనే 100 బాలికల హాస్టళ్లను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే 10-15 రోజుల్లో వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది. శుక్రవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్‌లో జరిగిన సమావేశంలో విద్యాశాఖలో వివిధ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మోడల్ స్కూళ్లు, వాటిల్లో బాలికల హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల నిర్మాణ పనులను విద్యాశాఖ అధికారులతోపాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు.
ప్రస్తుతం దాదాపు రూ.1,500 కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు 89 మోడల్ స్కూళ్లలో హాస్టళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 11 హాస్టళ్ల నిర్మాణాలు నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తై మరో 5 స్కూళ్లలోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా మోడల్ స్కూళ్ల సంఖ్య 192కు చేరుతుందన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ మూడో దశ కింద కేంద్రం నుంచి రూ. 200 కోట్లు రావాల్సి ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రూ. 5 వేలు గౌరవ వేతనం: మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లలో వార్డెన్లుగా ఉన్న టీచర్లకు అదనంగా రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. హాస్టళ్లలో భద్రత కోసం ఒక వాచ్‌మెన్‌ను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ప్రారంభించబోయే హాస్టళ్ల నిర్వహణ వ్యయాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది.
3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణం పూర్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నెలల్లో 14,526 టాయిలెట్ల నిర్మాణాలను విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, బీడీఎల్ తదితర సంస్థలు చేపట్టిన 251 టాయిలెట్ల నిర్మాణాలు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అలాగే టాయిలెట్లలో నీటి సదుపాయం, అన్ని స్కూళ్లలో తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ఆర్‌ఎంఎస్‌ఏ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ అదనపు ఎస్‌పీడీ భాస్కర్‌రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.