భూబిల్లును ఓడించి తీరుతాం
రాజస్తాన్‌లో పార్టీ సమావేశంలో రాహుల్
* మోదీ 56 అంగుళాల ఛాతీని ప్రజలు 5.6 అంగుళాలకు తగ్గిస్తారని వ్యాఖ్య
జైపూర్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ ఓడించి తీరుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆరు నెలల్లో ప్రజలు ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తారని వ్యాఖ్యానించారు.
రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లండన్ నుంచి లలిత్ మోదీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నాడని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాజస్తాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ ఓడించి తీరుతుంది. మొదటిసారి ప్రతిపక్షానికి సాయం చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
వారికి అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌కు సాయం చేస్తున్నారు. రైతుల నుంచి ఒక్క అంగుళం భూమి కూడా లాక్కోకుండా చూస్తాం. ఆ 56 అంగుళాల ఛాతీ(మోదీని ఉద్దేశించి) 5.6 అంగుళాలకు తగ్గిపోతుంది. వచ్చే ఆరు నెలల కాలంలో కాంగ్రెస్, ఈ దేశ ప్రజలు, రైతులు, కూలీలు ఈ పనిచేయబోతున్నారు’ అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ను ఉద్దేశించి ‘56 అంగుళాల’ వ్యాఖ్య చేశారు. ‘ములాయంజీ.. యూపీని గుజరాత్‌గా మార్చడం అంత సులభం కాదు.
అలా మారాలంటే 24 గంటల కరెంటు ఇవ్వాలి. అంతకుమించి 56 అంగుళాల ఛాతీ ఉండాలి’ అని అన్నారు. కాగా రాహుల్ రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాటి ఆంగ్లేయుల పాలనతో పోల్చారు. ‘లండన్ నుంచి లలిత్ మోదీ రిమోట్ బటన్ నొక్కితే.. ఇక్కడ రాజే ఎగురుతున్నారు’ అని దుయ్యబట్టారు. పెద్దఎత్తున నల్లధనాన్ని వెనకేసుకున్న లలిత్‌కు రాజే సాయం చేశారని విమర్శించారు. ఇది వసుంధర ప్రభుత్వం కాదని, లలిత్ మోదీ ప్రభుత్వమని పేర్కొన్నారు.
‘నల్ల’ మాటలేమయ్యాయి?
ఎన్నికల్లో అనేక మాటలు చెప్పిన మోదీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేశారని రాహుల్ విమర్శించారు. ‘అవినీతిని నిర్మూలిస్తామన్నారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తెప్పిస్తామన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్నారు. ఇప్పుడు లలిత్ లక్షల కోట్లు వెనకేసుకొని లండన్‌లో కూర్చొన్నాడు. ఆయన్ను వెనక్కి రప్పించండి. ఇక్కడ నడుస్తున్న ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయండి.
గతంలో రాజే, లలిత్ కలిసి వ్యాపారాలు చేశారు. బీజేపీ రాష్ట్రాల్లో జరిగిన స్కాంలపై 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని ఏమీ మాట్లాడరు’ అని ఎద్దేవా చేశారు. అధికారాలన్నింటినీ ప్రధాని తన వద్దే అట్టిపెట్టుకొని, మంత్రులను డమ్మీలుగా మార్చేశారన్నారు.