‘లైన్’ క్లియర్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించడంతో మందకొడిగా సాగుతున్న భూసేకరణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే శాఖ పరంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ ఎంపీల ద్వారా విన్నవించుకున్నప్పటికీ.. ఈ ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే లైన్ భూసేకరణకు రూ.120కోట్లు కేటాయించిన నేపథ్యంలో పనులు ఊపందుకోనున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్ అనేక ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే రైల్వే లైన్‌కు మినహా ఏ ఒక్కదానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దశాబ్ద కాలంగా ఇటు కొత్తగూడెం, అటు సత్తుపల్లివాసులను రైల్వే లైన్ ఊరిస్తోంది.
సింగరేణి సంస్థ లైన్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. సర్వే పనులు ఆలస్యం కావడంతో పనులు పట్టాలెక్కని పరిస్థితి. గతంలో మంజూరు చేసిన రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో ఈ లైన్ ఉండటంతో కేంద్రం బడ్జెట్లో రూ.120కోట్లు మంజూరు చేసింది. సుమారు 53 కిలోమీటర్లు ఉండే మార్గంలో పెద్ద ఎత్తున భూములు సేకరించాల్సి ఉంది. అయితే కొత్త భూసేకరణ విధానం ప్రకారం ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నిధులతోనే భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ పూర్తయి.. పరిహారం చెల్లించే ప్రక్రియ కొలిక్కి వస్తే తప్ప నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2010–11 బడ్జెట్లో కేంద్ర రైల్వే శాఖ రైలు మార్గం నిర్మాణానికి అనుమతిచ్చింది. సుమారు రూ.337.50కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా సర్వే పనులు పూర్తి చేశారు. సత్తుపల్లి వరకు 53.25 కిలోమీటర్ల మేరకు ఎలక్ట్రికల్ లైన్లతో లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. భూసేకరణ కోసం రైల్వే శాఖ రూ.19.04కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. సింగరేణి సంస్థ రైల్వేకు రూ.318.64కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. 2012, ఆగస్టులో సర్వే నిమిత్తం రూ.6.38కోట్లను రైల్వే శాఖకు సింగరేణి చెల్లించింది. లైన్ నిర్మాణం పూర్తయితే సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు బొగ్గును రైలు మార్గంలో రవాణా చేసేందుకు రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ కోసం కేంద్రం రూ.120కోట్లు కేటాయించింది. దీంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
కాలయాపనతో పెరిగిన అంచనా వ్యయం
తొలుత రూ.360కోట్లతో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే కాలయాపన కావడంతో ప్రాజెక్టు వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు 2015లో సింగరేణి సంస్థ రీ సర్వే కోసం రైట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సర్వే చేసిన రైట్స్ సంస్థ రూ.792కోట్ల అంచనాతో రూపొందించిన ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. భూసేకరణ, సర్వే, అటవీ శాఖ అనుమతుల కోసం సింగరేణి రూ.80కోట్ల నిధులు విడుదల చేసింది. రైలు మార్గానికి సర్వే పూర్తి కావడంతో భూసేకరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
ఐదు స్టేషన్లు.. పెనుబల్లి జంక్షన్
ఈ మార్గంలో ఐదు స్టేషన్లతో పెనుబల్లి జంక్షన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భావన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ స్టేషన్, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లి రోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు.
రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లి రోడ్ రైల్వేస్టేషన్‌ను కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్‌కాస్టుకు వెళ్లే విధంగా లైన్ వేస్తున్నారు. కొత్త లంకపల్లి రాష్ట్రీయ రహదారిపై రైలు కోసం ఓవర్ బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదనలు చేశారు.