'మోదీ 56 అంగుళాల ఛాతి 5.6కు తగ్గుతుంది'
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్రమోదీని వదిలిపెట్టే సమస్యేలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మరో ఆరు నెలల్లో ప్రస్తుతం ప్రధాని మోదీకి ఉన్న 56 అంగులాల ఛాతీ..5.6 అంగుళాలకు తగ్గిపోతుందని ఘాటుగా విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ఆరోజు పార్లమెంటులో చూస్తారులే అన్నారు. మోదీ ఛాతీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ వెంటనే స్పందించింది.
కేవలం 5.6 అంగుళాల మేరకు మాత్రమే చూడగలిగినవారు దాని వెనుక ఎంత ఉందో చూడలేరని సంబిత్ పాత్రా ఎదురుదాడి చేశారు. అంతేకాకుండా, లలిత్ మోదీ నేరానికి పాల్పడ్డారని, ఆర్థిక చట్టాలను అతిక్రమించారని, ప్రధాని నరేంద్రమోదీగారు వెంటనే ఆయన్ను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, సుష్మా స్వరాజ్ల పాత్రలను ఎండగట్టనున్నామని కూడా పరోక్షంగా రాహుల్ గాంధీ సంకేతాలిచ్చారు. ఇదే జరిగితే, మరోసారి పార్లమెంటులోని ఉభయసభలు దద్ధరిల్లనున్నాయి.