
రాహుల్ ‘భరోసా యాత్ర’ అదిరిపోవాలి!
పర్యటన ఏర్పాట్లపై నేతలతో రఘువీరా సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అదిరేలా ఉండాలని అందుకు తగ్గట్టుగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఉపాధి కూలీల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ ఈ నెల 24న అనంతపురం జిల్లా నల్లమాడ నుంచి ఓ.డి.చెరువు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు.
23వ తేదీ రాత్రికి పుట్టపర్తికి చేరుకొని ఆ రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని ఆయన భరోసా యాత్ర చేపడతారు. పాదయాత్రలో భాగంగానే అక్కడక్కడ రాహుల్ గాంధీతో మాట్లాడించాలని నిర్ణయించారు. 15 కిలోమీటర్ల పైబడి యాత్ర చేపడుతున్నందున కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నింపేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించారు.
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఇందిరభవన్‌లో ఆ పార్టీ నేతలతో సమావేశమై రాహుల్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా యాత్ర సందర్భంగా ఆర్థిక సహాయం అందించనున్నారు.