పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
అప్పుడే పసుపు రైతులకు న్యాయం
► ప్రధానిని కోరిన ఎంపీ కవిత
► బీడీలపై జీఎస్టీ వద్దని విజ్ఞప్తి
► ఎమ్మెల్యేల బృందంతో కలసి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పసుపు రైతుల కోసం ప్రత్యేకంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని నిజామాబాద్ ఎంపీ కె.కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గణేశ్ గుప్తా, విద్యాసాగర్‌రావు తదితరులతో కలసి గురువారం పార్లమెంటులో ప్రధానితో ఆమె సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. బోర్డు ఏర్పాటుకు మద్దతుగా మహారాష్ట్ర, అసోం, కేరళ సీఎంలు రాసిన లేఖలను ప్రధానికి అందజేశారు. ‘‘పసుపు బోర్డు ఏర్పాటు వల్ల కొత్త వంగడాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చు. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. మద్దతు ధర లభించే అవకాశముంటుంది’’అని వివరించారు. పసుపు దిగుమతులను నిలిపేయాలని కూడా ప్రధానిని కోరారు.
బీడీలపై జీఎస్టీ వల్ల పడుతున్న తీవ్ర ప్రభావాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బీడీలపై సిగరెట్లతో సమానంగా పన్ను విధించడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన 99 శాతం మంది మహిళలు ఉపాధి కోల్పోతారన్నారు. కను బీడీలపై పన్ను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రి జవదేకర్‌తో కూడా కవిత భేటీ అయ్యా రు. జగిత్యాలలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతోనూ సమావేశమయ్యారు. నిజామాబాద్‌లో 100 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పార్కుకు రూ.80 లక్షలే విడుదల చేశారన్నారు. మరిన్ని నిధులివ్వాలని కోరారు.
మీ ‘హెల్మెట్’ప్రచారం భేష్
కవితను ప్రశంసించిన ప్రధాని
మనకీ బాత్‌లో పిలుపునివ్వండి
మోదీకి సూచించిన ఎంపీ
హెల్మెట్ వాడకంపై ఎంపీ కవిత చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రశంసించినట్టు సమాచారం. రాఖీ నాడు ప్రతి మహిళా తమ సోదరులకు హెల్మెట్ బçహూకరించాలంటూ ఆమె చేపడుతున్న కార్యక్రమాన్ని ఆయన మెచ్చుకున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం తనకు బాగా నచ్చిందని, దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రధాని సూచించినట్టు సమాచారం. అలాగే ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్ నిరాకరించేలా విధానాన్ని తెద్దామా అని కూడా కవితను ప్రధాని అడిగారని తెలిసింది.
కాకపోతే, అలా చేస్తే పెట్రోల్ బంకుల బయట నిమిషాల లెక్కన హెల్మెట్‌ను అద్దెకిచ్చే దందా మొదలవుతుందేమోనని ఆయనే సందేహం వెలిబుచ్చినట్టు సమాచారం. ప్రతి మహిళా రాఖీ పండుగ నాడు తమ సోదరులకు హెల్మెట్ ఇచ్చేలా అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ విషయాన్ని ఈసారి మన్ కీ బాత్‌లో చెప్పాలని ప్రధానిని కవిత కోరినట్టు తెలుస్తోంది.