విజయవాడ : రైల్వే చిరుద్యోగులకు 'కాల్ మనీ' వడ్డీకి అప్పులు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న గుడివాడకు చెందిన కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు 59, ఏటీఎం కార్డులు 83, ఆరు నాన్ జ్యుడీషియరీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ చెప్పారు. ఈ నెల 24న కార్పొరేషన్ చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్న రాంపిళ్ల పాపారావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిని కమిషనరేట్ పోలీసులు అరెస్టులు చేయడం సంచలనం కలిగిస్తోంది.
డీసీపీ కాళిదాస్ కథనం ప్రకారం.. సుబ్బారెడ్డి మొబైల్ ఫోన్ల వ్యాపారంతో పాటు విజయవాడ, గుడివాడ పట్టణాల్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వేలో పని చేసే చిరుద్యోగులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నాడు. ఇందుకోసం ఖాళీ నోట్లు, చెక్కులు, బ్యాంక్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు తీసుకుంటాడు. ఆయా ఉద్యోగులు ఏళ్ల తరబడి వడ్డీలు చెల్లిస్తున్నారు. కనీసం తమకు జీతం ఎంత వస్తుందనే విషయం కూడా వారికి తెలియదు. ఫైనాన్స్ వ్యాపారి తన వడ్డీ పోను ఇచ్చింది తీసుకొని కుటుంబాన్ని గడుపుకోవడమే. ఒకవేళ పూర్తిగా అప్పులు చెల్లించినా వారికి ఇవ్వాల్సిన పత్రాలు, ఇతర ఆధారాలు ఇవ్వడు. గట్టిగా నిలదీస్తే అనుచరులతో కోర్టు కేసులు వేయించి వేధింపులకు పాల్పడుతుంటాడు.
సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన పలువురు చిరుద్యోగులు తాము అప్పు చెల్లించినా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంటూ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ రంగంలోకి దిగి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నోట్లు, చెక్కులు, పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. కొత్తపేట పోలీసులు కె.ఎల్.రావునగర్ కుండల మార్కెట్ ప్రాంతానికి చెందిన కానుళ్ల కోటేశ్వరరావు మెడికల్ షాపుపై దాడి చేసి పెద్ద మొత్తంలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు, రోజువారీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
మరో 'కాల్ మనీ' వ్యాపారి అరెస్ట్
Published Sat, Dec 26 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement