సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదులు అందినప్పుడు వాటిపై ఆయన నిర్ణయం తీసుకోవడానికి ముందే ఆ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా..?’ అని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అలా జోక్యం చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పులిచ్చి ఉంటే వాటిని తమ ముందుంచాలని పిటిషనర్లకు సూచించింది. ఎమ్మెల్యేలు తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి (టీడీపీ); రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి (కాంగ్రెస్); మదన్‌లాల్ (వైఎస్సార్‌సీపీ)లు పార్టీ ఫిరాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆయా పార్టీల నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా ‘ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, ఎప్పటిలోగా తీసుకుంటారో చెప్పండి’ అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డిని ధర్మాసనం నిర్దేశించింది. కానీ ఏజీ బుధవారం హాజరుకాలేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ధర్మాసనం ఆదేశాల మేరకు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
‘‘ఫిరాయింపుల ఫిర్యాదులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారంలో స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తలసానికి మంత్రి పదవి కట్టబెట్టారు..’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రిగా ఆరు నెలలు కొనసాగవచ్చు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి మంత్రిగా ఉన్నారా అన్నది అనవసరం. ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందే మేం జోక్యం చేసుకుని, నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించవచ్చా అన్నదానిపై మేం విచారణ జరుపుతాం’’ అని స్పష్టం చేసింది.
దాంతో సుప్రీంకోర్టు గత తీర్పును, పదో షెడ్యూల్‌లోని నిబంధనలను పిటిషనర్ల న్యాయవాది చదివి వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం వేసిన ప్రశ్నలకు ఆయన తడబడటంతో.. వాదనలు వినిపించేముందు సిద్ధమై రావాలని సూచించింది. తదుపరి విచారణను గురువారం చేపడతామని తెలిపింది.
ముందే జోక్యం చేసుకోవచ్చా?
Published Thu, Jul 23 2015 2:56 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement