కార్మికుడి మృతితో ప్రధాని కలత
మోదీ సభ జరగాల్సిన మైదానంలో విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్‌డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్‌తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో గురువారం అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలను వెంటనే రద్దు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
కార్మికుడి కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దేవనాథ్ అనే కార్మికుడు వేకుజామున విద్యుత్ పనులు చేస్తుండగా, ఏడెనిమిది అడుగుల ఎత్తు నుంచి కాలుజారి కిందపడ్డాడని, వైరు తెగిపోయి షాక్ కొట్టడంతో మరణించాడని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడన్నారు. మూడువారాల కిందట కూడా వారణాసిలో భారీవర్షాల వల్ల మోదీ తన కార్యక్రమాలను రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే.