Worker killed
-
బీజేపీ కార్యకర్త హత్య
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాగ్రాం జిల్లాలో శనివారం రాత్రి బీజేపీ కార్యకర్త రమిన్ సింగ్ హత్యకు గురయ్యారు. తృణమూల్ కార్యకర్తలు సింగ్ ఇంట్లోకి చొరబడి దారుణంగా హతమార్చారని బీజేపీ నేత కైలాష్ విజయ్‌వర్గీయ ఆరోపించారు. మరోవైపు భగవాన్‌పూర్, తూర్పు మిడ్నపూర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కొందరు కాల్పులకు తెగబడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకూ జరిగిన పలు దశల పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా బీజేపీ కార్యకర్తలపై తమ పార్టీ శ్రేణులు దాడికి తెగబడ్డాయన్న బీజేపీ నేతల ఆరోపణలను తృణమూల్ నేతలు తోసిపుచ్చారు. ఆరో దశ పోలింగ్‌లో భాగంగా ఆదివారం బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్ధానాల్లో పోలింగ్ జరుగుతోంది. -
పోలవరం పనుల్లో అపశృతి
సాక్షి, పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాజెక్టు స్పిల్‌వే 32వ బ్లాక్‌లో సోమవారం ఉదయం గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్ సహాయంతో గేట్లు దించుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన భీమిలేష్ కుమార్ రామ్ (22)పై రాడ్డు పడి తీవ్రగాయాలయ్యాయి. పోలవరం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. 15వ బ్లాక్‌లో పనిచేస్తున్న సతీష్ అనే కార్మికుడు స్పిల్‌వే పైనుంచి జారిపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని పోలవరం వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్సకు రాజమండ్రికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే భీమిలేష్ మృతిచెందాడంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వడంతో అక్కడున్న ఓ వాహనం స్వల్పంగా దెబ్బతింది. అక్కడి నుంచి 150 మంది కార్మికులు నవయుగ గెస్ట్‌హౌస్‌కు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. తమకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో లేబర్ కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. -
మున్సిపల్ వర్కర్ దారుణ హత్య
ఇల్లెందు (ఖమ్మం) : సహచరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో ఘర్షణపడడంతో మున్సిపల్ వర్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఇల్లెందు మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేసే వర్కర్ నాతారి రవి(30) మొండితోగు శ్మశానవాటిక సమీపంలో విగతజీవిగా పడి ఉన్న సమాచారం పోలీసులకు చేరింది. శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో పడి ఉన్న రవిని హుటాహుటిన హాస్పిటల్‌కు చేర్చారు. అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇల్లెందు వినోభానగర్ ఏరియాకు చెందిన రవి తన స్నేహితుడు ముకేష్తో కలిసి అదే ఏరియాకు చెందిన కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అంత్యక్రియల సందర్భంగా అక్కడ మద్యం సేవించారు. పరస్పరం రవి, ముకేష్లు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ముకేష్ రవిని రాయితో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సీఐ సారంగపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విషవాయువే మింగింది
పాత గుళాయిలోకి వెళ్లడం వల్లే బదిలీ కార్మికుడు అనిల్‌కుమార్ మృతి జీడీకే-7లో విషవాయువున్నట్లు నిర్ధారించిన అధికారులు..? యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : విషవాయువు వల్లే కార్మికుడు మింగనబోయిన అనిల్‌కుమార్ మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అతను బహిర్భూమికి వెళ్లిన పాత గుళాయి ప్రాంతానికి బుధవారం వారు చిమ్నీలను పట్టుకెళ్లగా అవి ఆరిపోయినట్లు సమాచారం. ఆర్జీ-2 ఏరియూ పరిధి జీడీకే-7ఎల్ఈపీ గనిలో 19వ లెవల్ 14వ డీప్ టాప్సీమ్-3లో గాలి వృథాను అరికట్టేందుకు గోడ నిర్మించడానికి నలుగురు కార్మికులతో కలిసి వెళ్లిన అనిల్‌కుమార్ మంగళవారం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారు లు లోతుగా విచారిస్తున్నారు. గోడ నిర్మాణానికి ఇటుకలు మోస్తున్న క్రమంలో మలవిసర్జన కోసం సమీపంలోని పాత గుళాయిలోకి వెళ్లి వచ్చిన అనిల్‌కుమార్ ఆ వెంటనే వాంతు లు చేసుకున్నాడని, ఏం జరిగిందో తెలసుకునేలోపే అతను తుదిశ్వాస విడిచినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. విషవాయువుతో నిండి ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. అక్కడ సూవర్వైజింగ్ అధికారులుంటే ఆవైపు వెళ్లనిచ్చేవారు కాదని పేర్కొంటున్నారు. విచారణ ప్రారంభించిన డీడీఎంఎస్ హైదరాబాద్ నుంచి వచ్చిన డీడీఎంఎస్ అధికారి ముఖర్జీ బుధవారం విచారణ ప్రారంభిం చారు. ఆయన గనిలోకి దిగి సంఘటనా స్థలా న్ని పరిశీలించిన అనంతరం కార్మికుని మృతికి దారి తీసిన పరిస్థితుల వివరాలు సేకరించా రు. గురువారం ఇక్కడే ఉండి ప్రత్యక్ష సాక్షుల తో వాంగ్మూలాలు సేకరించనున్నారు. నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన కార్మికుడి మృతిపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గని ప్రమాదంగా గుర్తించి మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతోపాటు అన్ని విధాల న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. అనంతరం బదిలీ వర్కర్లం దరూ విధులు బహిష్కరించి అనిల్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వెళ్లారు. పర్యవేక్షణ లేకపోవడంవల్లే : టీబీజీకేఎస్ పని స్థలాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రాంమూర్తి, సారంగపాణి, నూనె కొమురయ్య, ఐలి శ్రీనివాస్ డీడీఎంఎస్ కు వినతి పత్రం అందజేశారు. గాలికొరత, మైనింగ్ సర్ధార్‌ల కొరత ఎక్కువగా ఉందని, మైన్స్, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. బాధ్యులపై చర్య తీసుకుని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇది లా ఉండగా అనిల్‌కుమార్ మృతి సంఘటన ను యాజమాన్యం గని ప్రమాదంగా గుర్తించి నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడి మృతి
నాదెండ్ల (గుంటూరు) : పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వలస వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గా యాలైన ఘటన బుధవారం చోటు చేసుకుం ది. గుంటూరు జిల్లా గణపవరం జాతీయ రహదారిలోని స్పి న్నింగ్ మిల్లు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తాడేపల్లిగూడెంకు చెందిన చెల్లంకి దుర్గాప్రసాద్ (21) మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన శివకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొందరు యువకులు గణపవరంలో నివాసముంటూ రోజూ స్పిన్నింగ్ మిల్లు పనులకు వెళ్తుంటా రు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్, శివ బైక్‌పై వెళ్తుండగా వేగంగా వెళ్తు న్న మరో ద్విచక్ర వాహనదారుడు ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టారు. దీంతో దుర్గాప్రసాద్ తలకు బల మైన గాయమై అక్కడి కక్కడే మృతిచెందాడు. శివకు తీవ్ర గాయాల వడం తో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. -
విషాదం నింపిన ప్రమాదం
ఆటో బోల్తాపడి కూలీ మృతి మరో 20 మంది కూలీలకు గాయాలు బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 21 మంది మహిళా వ్యవసాయకూలీలు గురువారం ఉదయం రోజులాగే సద్ది కట్టుకొని అదే గ్రామానికి చెందిన రాములుకు చెందిన సెవెన్ సీట్స్ ఆటోలో పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామంలో వరిపొలంలో ముదురు తీయడానికి బయలుదేరారు. వారి వాహనం కప్రాయపల్లి గ్రామసమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టుపైకి ఎక్కి బోల్తా పడింది. పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న సర్పంచ్ రాగీరు సత్యనారాయణ, గ్రామస్తులను వెంట తీసుకొని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆటోలో చిక్కుకున్న వారిని చూసి బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆటో ఒకవైపు ఒరిగిపోవడంతో చివరలో కూర్చున్న దొంటికే సుగుణమ్మ (55) అనే మహిళపై మిగతా కూలీలంతా పడిపోయారు. దాంతో సుగుణమ్మ గొంతుకు ఆటోలోని రాడుకు మధ్య ఒత్తిడి ఏర్పడి ఊపిరాడక కొట్టుమిట్టాడిపోయింది. అతికష్టంమీద ఆమెను బయటికి తీసి నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలొదిలింది. ఇదిలావుండగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మిర్యాల అంజమ్మ, కొమురమ్మ, నారి పోషమ్మ, మిర్యాల లక్ష్మమ్మ, మల్లమ్మ, బీర కళమ్మ, దొంటికె రేణుక, కడెం లక్ష్మి, కడెం కళమ్మ, సంకూరి బాలమణి, కడెం బీరమ్మ, దొమ్మిడికే భాగ్య, కడెం ఆగమ్మ, దొడ్డి లావణ్య, అండాలులకు బలమైన గాయాలవ్వగా మిగిలిన నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఉప్పల్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో దొంటికే రేణుక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగన్మోహన్రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.చనిపోయిన సుగుణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేశారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని, అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ నిర్ధారించారు. మిన్నంటిన రోదనలు సంఘటన స్థలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. మంచిచెడ్డా చెప్పుకుంటూ, పల్లె పాటలు పాడుకుంటూ నవ్వుతూ వెళ్తున్న కూలీలు ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో వారు షాక్‌కు గురయ్యారు. తోటి కూలీ మృతి చెందిందని తెలిసి వారు జీర్జించుకోలేక పోయారు. ఇదిలావుండగా సుగుణమ్మ భర్త రెండేళ్ల క్రితం చనిపోగా ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండగా ఆమె మృతితో పిల్లలు అనాథలుగా మారారు. -
హెచ్బీఎల్లో కార్మికుడి మృతి
పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో గల హెచ్‌బీఎల్ పరిశ్రమలో క్రేన్బెల్ట్ తెగిపడడంతో ఐరెన్పోల్ మీద పడి బుధవారం ఓ ఎన్ఎంఆర్ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలలోకి వెళ్తే నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామనికి చెందిన జమ్ము రమణ (43) హెచ్‌బీఎల్ పరిశ్రమలో గల సీబీడీ యూనిట్లో రెండు నెలలు క్రితం ఎన్ఎంఆర్ కార్మికునిగా చేరాడు. విధినిర్వహణలో భాగంగా యూనిట్లో క్రేన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 12.30 సమయంలో నిలబడి ఉండగా హఠాత్తుగా క్రేన్‌కు ఉన్న వైర్ తెగి, ఐరెన్ పోల్ అతని తలపై పడింది. దీంతో పోల్ కింద చిక్కుకున్న రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే యాజమాన్యం అంబులెన్స్‌లో రమణ మృతదేహాన్ని ఫ్యాక్టరీ బయటకు తరలించింది. విషయం తెలుసుకున్న మిగతా కార్మికులు గేటు వద్దకు వచ్చి బైటాయించి, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మృతదేహాన్ని తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజ మాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. హెచ్ఆర్ మేనేజరు రామకృష్ణను కార్మికులు చుట్టుముట్టి మృతిచెందిన కార్మికుని కుటుబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రదానకార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణతో పాటు ,కార్మికులు,గుషిణి గ్రామస్తులు పరిశ్రమ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బోగాపురం సీఐ వైకుంఠరావు ,ఎస్ఐ శ్రీనువాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది గేటువద్ద వచ్చి కార్మికులను శాంతింపజేశారు. కార్మికుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చింది. రమణ కుటుంబానికి రూ.11 లక్షలు నష్టపరిహారంగా అందజేసేందుకు అంగీకరించింది. అలాగే రమణ భార్య ఆది లక్ష్మికి నెలకు రూ1800, ఇద్దరు పిల్లలు మహేష్, సత్తిబాబులకు రూ.400 చొప్పున పింఛన్ అందజేసేందుకు అంగీకరించింది. మృతుని కుమారులు సతివాడలోగల ఆదర్శపాఠశాలలో చదువుతున్నారు. రమణ మృతి చెందడంతో భార్యాపిల్లలు భోరున విలపిస్తున్నారు. యాజ మాన్యంతో జరిగిన చర్చలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పతివాడ అప్పలనాయుడు,చనమల వెంకటరమణ, అంబళ్ల శ్రీరాములునాయుడు, పిన్నింటి వెంకటరమణ పాల్గొన్నారు. -
కార్మికుడి మృతితో ప్రధాని కలత
మోదీ సభ జరగాల్సిన మైదానంలో విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్‌డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్‌తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో గురువారం అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలను వెంటనే రద్దు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కార్మికుడి కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దేవనాథ్ అనే కార్మికుడు వేకుజామున విద్యుత్ పనులు చేస్తుండగా, ఏడెనిమిది అడుగుల ఎత్తు నుంచి కాలుజారి కిందపడ్డాడని, వైరు తెగిపోయి షాక్ కొట్టడంతో మరణించాడని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడన్నారు. మూడువారాల కిందట కూడా వారణాసిలో భారీవర్షాల వల్ల మోదీ తన కార్యక్రమాలను రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి
వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో శనివారం జరిగింది. వివరాలు.. ఇల్లంద గ్రామానికి చెందిన వీరయ్య (28) గీత కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తాటిచెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (వర్ధన్నపేట) -
పోలీసు కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి
భాకరాపేట: శేషాచలంలోని ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ కూలీ హతమయ్యాడు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీ సమీపంలోని కడతలకొండ అటవీ ప్రాంతం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలు...శేషాచల అటవీ ప్రాంతంలోని తలకోన సమీపంలో పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలను కూలీలు తరలిస్తున్నారనే సమాచారం అందడంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఏఆర్ పోలీసులను నాలుగు బృందాలుగా కూంబింగ్ కు పంపించారు. ఇందులో రెండు పార్టీలు తలకోనలో కూంబింగ్ జరుపుతుండగా 150 మంది కూలీలు, స్మగ్లర్లు వీరి కంటపడ్డారు. పోలీసులను చూసిన నిందితులు తప్పించుకున్నారు. వారిలో 30 మంది బొంబాదికొండ నుంచి కడతలకొండ వైపుగా భాకరాపేట కనుమ వద్దకు ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ వెళ్లి అక్కడే బస చేశారు. ఇదే సమయంలో కల్యాణిడ్యాం నుంచి కూంబింగ్ జరుపుతూ వచ్చిన మరో పార్టీ పోలీసులకు వీరు కనిపించారు. దీంతో పోలీసులు ముందుగా హెచ్చరించారు. కూలీలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు గాలిలోకికాల్పులు జరిపారు. అయినా కూలీలు రాళ్ల వర్షం కురిపించడంతో పోలీసులు నేరుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కూలీ మృతి చెందాడు. దీంతో సంఘటన స్థలం వద్ద దుంగలను వదిలేసి మిగిలిన వారంతా పారిపోయారు. వారు వదిలేసి వెళ్లిన 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన కూలి ఎవరనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.