ఆటో బోల్తాపడి కూలీ మృతి
మరో 20 మంది కూలీలకు గాయాలు
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 21 మంది మహిళా వ్యవసాయకూలీలు గురువారం ఉదయం రోజులాగే సద్ది కట్టుకొని అదే గ్రామానికి చెందిన రాములుకు చెందిన సెవెన్ సీట్స్ ఆటోలో పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామంలో వరిపొలంలో ముదురు తీయడానికి బయలుదేరారు. వారి వాహనం కప్రాయపల్లి గ్రామసమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టుపైకి ఎక్కి బోల్తా పడింది. పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న సర్పంచ్ రాగీరు సత్యనారాయణ, గ్రామస్తులను వెంట తీసుకొని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆటోలో చిక్కుకున్న వారిని చూసి బయటకు లాగే ప్రయత్నం చేశారు.
ఆటో ఒకవైపు ఒరిగిపోవడంతో చివరలో కూర్చున్న దొంటికే సుగుణమ్మ (55) అనే మహిళపై మిగతా కూలీలంతా పడిపోయారు. దాంతో సుగుణమ్మ గొంతుకు ఆటోలోని రాడుకు మధ్య ఒత్తిడి ఏర్పడి ఊపిరాడక కొట్టుమిట్టాడిపోయింది. అతికష్టంమీద ఆమెను బయటికి తీసి నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలొదిలింది. ఇదిలావుండగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మిర్యాల అంజమ్మ, కొమురమ్మ, నారి పోషమ్మ, మిర్యాల లక్ష్మమ్మ, మల్లమ్మ, బీర కళమ్మ, దొంటికె రేణుక, కడెం లక్ష్మి, కడెం కళమ్మ, సంకూరి బాలమణి, కడెం బీరమ్మ, దొమ్మిడికే భాగ్య, కడెం ఆగమ్మ, దొడ్డి లావణ్య, అండాలులకు బలమైన గాయాలవ్వగా మిగిలిన నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఉప్పల్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో దొంటికే రేణుక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.చనిపోయిన సుగుణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేశారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని, అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ నిర్ధారించారు.
మిన్నంటిన రోదనలు
సంఘటన స్థలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. మంచిచెడ్డా చెప్పుకుంటూ, పల్లె పాటలు పాడుకుంటూ నవ్వుతూ వెళ్తున్న కూలీలు ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో వారు షాక్‌కు గురయ్యారు. తోటి కూలీ మృతి చెందిందని తెలిసి వారు జీర్జించుకోలేక పోయారు. ఇదిలావుండగా సుగుణమ్మ భర్త రెండేళ్ల క్రితం చనిపోగా ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండగా ఆమె మృతితో పిల్లలు అనాథలుగా మారారు.
విషాదం నింపిన ప్రమాదం
Published Thu, Aug 13 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement