పోలీసు కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి
భాకరాపేట: శేషాచలంలోని ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ కూలీ హతమయ్యాడు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీ సమీపంలోని కడతలకొండ అటవీ ప్రాంతం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.
వివరాలు...శేషాచల అటవీ ప్రాంతంలోని తలకోన సమీపంలో పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలను కూలీలు తరలిస్తున్నారనే సమాచారం అందడంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఏఆర్ పోలీసులను నాలుగు బృందాలుగా కూంబింగ్ కు పంపించారు. ఇందులో రెండు పార్టీలు తలకోనలో కూంబింగ్ జరుపుతుండగా 150 మంది కూలీలు, స్మగ్లర్లు వీరి కంటపడ్డారు. పోలీసులను చూసిన నిందితులు తప్పించుకున్నారు.
వారిలో 30 మంది బొంబాదికొండ నుంచి కడతలకొండ వైపుగా భాకరాపేట కనుమ వద్దకు ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ వెళ్లి అక్కడే బస చేశారు. ఇదే సమయంలో కల్యాణిడ్యాం నుంచి కూంబింగ్ జరుపుతూ వచ్చిన మరో పార్టీ పోలీసులకు వీరు కనిపించారు. దీంతో పోలీసులు ముందుగా హెచ్చరించారు. కూలీలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు గాలిలోకికాల్పులు జరిపారు.
అయినా కూలీలు రాళ్ల వర్షం కురిపించడంతో పోలీసులు నేరుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కూలీ మృతి చెందాడు. దీంతో సంఘటన స్థలం వద్ద దుంగలను వదిలేసి మిగిలిన వారంతా పారిపోయారు. వారు వదిలేసి వెళ్లిన 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన కూలి ఎవరనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.