
కిడ్నాప్ కాదు..ప్రియుడితోనే వెళ్లింది
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్లో కిడ్నాపైన వివాహిత రాధిక విషయంలో గుట్టు రట్టైంది. ఈనెల 6న రాజేంద్రనగర్లో కిడ్నాపైన రాధిక కేసును పోలీసులు ఛేదించారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్తో కలిసి కోల్కతాకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపారు. డబ్బుల కోసమే ప్రియుడుతో కలిసి రాధిక వాట్సాప్ ద్వారా భర్తను బ్లాక్ మెయిల్ చేసిందని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు వివాహం చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు.
కాగా వివాహిత మహిళ కిడ్నాప్ విషయం కలకలం రేపింది. రాధికను కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేస్తున్నట్లు వాట్సప్ లో ఫోటోలు.. భర్తకు పంపి రిజ్వాన్ డబ్బు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.