
రవళించిన మానవత్వం..
♦ రవళిని ఆదుకునేందుకు
♦ ముందుకొచ్చిన ఆపన్న హస్తాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మానవత్వం పరిమళించింది. ‘అమ్మ పొమ్మంది.. ఊరు రమ్మంది’ అంటూ ఈ నెల 13న ‘సాక్షి’ ప్రచురించిన కథ నానికి పలువురు స్పందించారు. 12 ఏళ్ల చిన్నారి రవళిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంకి చెందిన చిన్నారి రవళి తల్లికి మతిస్థిమితంలేదు. ఆమె తండ్రికి కూడా దూరమైంది. దీనిపై సాక్షి ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ఆ పాపను దత్తత తీసుకుంటామని, చదివిస్తామని ముందుకొచ్చారు.
ఆమెను బాలసదన్‌లో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచాలన్న ఆలోచన తో, ఉన్నతాధికారుల సహా యంతో ఆమెకు ఆశ్రయాన్ని కల్పించారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ చేతుల మీదుగా ఆమెకు బ్యాంకు అకౌంట్ బుక్ అందజేశారు. రవళికి సాయం చేయాలనుకునేవారు అకౌంట్ నంబర్ 624561 63545లో నగదు జమ చేయవచ్చు. దాతలు అకౌంట్ వివరాల కోసం నల్లగొండలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రకాశం బజార్ శాఖ)లో సంప్రదించవచ్చు.