సింగూరు ఎత్తిపోతల.. ఉత్తిమాటేనా? | singooru lift irrigation works in prolang due to land aquisation | Sakshi
Sakshi News home page

సింగూరు ఎత్తిపోతల.. ఉత్తిమాటేనా?

Published Thu, Jul 9 2015 7:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

singooru lift irrigation works in prolang due to land aquisation

    తొమ్మిదేళ్లుగా ఊరిస్తోంది..

  •      కొలిక్కి రాని ఎత్తిపోతల పథకం
  •      పనులు ముమ్మరం చెయ్యాలన్న మంత్రి
  •      సర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న రైతులు
  •      మళ్లీ మొదటికొచ్చిన సమస్య

మెదక్ (పుల్‌కల్): సింగూరు వరద కాలువ పనులు సందిగ్ధంలో పడ్డాయి. దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించ గల ఈ ఎత్తిపోతల పథకం తొమ్మిదేళ్లుగా రైతులను ఊరిస్తూనే ఉంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తాజాగా మంగళవారం.. 'సింగూర్ వరద కాల్వ పనులను వచ్చే నెల 15 లోగా పూర్తి చేయాలి'అని ఆదేశించారు. అయితే, మర్నాడే.. ఈ కాలువ పనుల నిమిత్తం భూమిని సర్వే చేసేందుకు బుధవారం చక్రియాల్ వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో సింగూరు ఎత్తిపోతల పథకం మళ్లీ డోలాయమానంలో పడింది.
 ఇదీ పథకం..
 సింగూర్ ప్రాజెక్టు ద్వారా అందోల్, పుల్‌కల్  మండల పరిధిలోని 40 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు నాటి ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో సింగూర్ ఎత్తిపోతల పథకానికి రు.16 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు, లిఫ్ట్ నిర్మాణానికి రూ.6 కోట్లు కేటాయిస్తూ నిధులు మంజూరు చేశారు. దాని కోసం టెండర్లు పూర్తి చేసి 2015 జూలై 18 నాటికి లిఫ్ట్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే, వివిధ కారణాల వల్ల పనులు మందగించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ పథకంపై దృష్టి సారించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు ఎత్తిపోతల పథకం పనులను నాలుగు భాగాలుగా విభజించి సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. సబ్‌స్టేషన్ పనులతో పాటు భవన నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. పైప్‌లైన్, కాల్వ పనులు పూర్తయితేనే పథకం పూర్తయినట్టు. తాజాగా మంత్రి మాత్రం.. ఆగస్టు 15లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కాంట్రాక్ట్ గడువు కూడా పొడిగించినట్లు తెలుస్తోంది.
 కాలువ పనులకు రైతుల షాక్
 మంత్రి హరీష్‌రావు మంగళవారం సింగూర్ ఎత్తిపోతల పథకం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాంత రైతులు సింగూర్ నీటి కోసం ఎదురు చూస్తున్నారని...ఈసారి ఖరీఫ్‌లో కనీసం పది వేల ఎకరాలకైనా నీరు అందించాలని ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నిర్వహిస్తున్న క్రమంలో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవసరమైతే పోలీసులను మోహరించి భూ సేకరణ చేయాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ... సర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నది రైతులే కావడంతో పనులపై సందేహం నెలకొంది.
 354 ఎకరాలు అవసరం..
 సింగూర్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అం దించాలంటే మరో 354 ఎకరాలు భూమి సేకరించాలి. అందుకోసం సర్వే పనులు పూర్తి చేసి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి.. జేసీకి సూచించారు. దీంతో పాటు వరద కాల్వలపై నిర్మించాల్సిన 74 కల్వర్టుల నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇవన్నీ ఆగస్టు 15లోగా పూర్తి కాకుంటే బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్ పేరు నమోదు చేయడంతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం తో అధికారులు వెంటనే కదిలారు. కానీ, బుధవారం చక్రియాల్ రైతులు సర్వే పనులను అడ్డుకోవడంతో ఎత్తిపోతల పథకం మళ్లీ మొదటికొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement