ఫోన్ ట్యాపింగ్‌పై విశాఖలో సిట్ దర్యాప్తు
Published Sun, Jul 12 2015 8:48 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
విశాఖపట్నం(పెదవాల్తేరు): ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శనివారం విశాఖలో దర్యాప్తు చేసింది. జిల్లాలో ఆరు పోలీస్‌స్టేషన్‌లతోపాటు నగరంలో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులను పరిశీలించింది. ఫిర్యాదుదారులను విచారించింది. కైలాసగిరి జిల్లా పోలీస్ గెస్ట్‌హౌస్‌కు వారిని పిలిపించుకుని వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, స్టీఫెన్‌సన్, హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులు, సాక్షి న్యూస్ మీడియా, తెలంగాణ న్యూస్ మీడియా (టీ చానల్)లు చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని పేర్కొంటూ జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు అందింది. వారి ఫిర్యాదుల మేరకు జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట, పాడేరు, చోడవరం పోలీస్‌స్టేషన్‌లు, నగరంలోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు తెలుసుకోవడానికి సిట్ నగరానికి వచ్చింది. ముందుగా ఫిర్యాదీలను విచారణ స్థలానికి రావాలని సూచించింది. ఫిర్యాదు చేసిన నలుగురు మాత్రమే విచారణకు హాజరైనట్టు తెలిసింది.
Advertisement
Advertisement