ఢిల్లీ: ఉన్నత విద్యామండలి కేసులో ఆంధ్రప్రదేశ్ కు ఊరట లభించింది. ఉన్నత విద్యా మండలి ఆస్తులు తెలంగాణకు చెందుతాయంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఏపీ ఉన్నత విద్యామండలి పిటీషన్లను సుప్రీంకోర్టు సమర్థించింది. కాగా ఉమ్మడి ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో తెలంగాణ, ఏపీ సర్కార్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఉమ్మడి మండలి సేవలు తమకవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తమ ఉన్నత విద్యామండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయ భవనంలోనే దానికి ఒక అంతస్తును ఏపీ మండలి కేటాయించింది. అయితే బ్యాంకు ఖాతాల విషయంలో రెండు మండళ్ల మధ్య వివాదం తలెత్తి అవి ఫ్రీజ్ కావడం, హైకోర్టులో కేసు దాఖలై తెలంగాణ మండలికి అనుకూలంగా తీర్పురాగా.. ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని తెలంగాణ మండలి స్వాధీనపర్చుకుంది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నత విద్యా మండళ్ల తరపు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.