నల్లజర్ల రూరల్ (పశ్చిమ గోదావరి): ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల విద్యార్థి కనిపించటం లేదని మంగళవారం సమాచారం అందింది. రెండు రోజులుగా కనిపించడం లేదని అతడి స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దుగ్గిన గోపాలకృష్ణ(23) 2014 అక్టోబర్‌లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. కొంతకాలానికి ఇదే గ్రామానికి చెందిన నీరుకొండ వంశీకృష్ణ, వల్లూరి చిట్టిబాబు సైతం ఆస్ట్రేలియా వెళ్లి గోపాలకృష్ణ చదువుతున్న కళాశాలలోనే చేరారు. ఆ ముగ్గురూ ఒకే రూంలో ఉంటున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలకృష్ణ ఆప్తమిత్రుడొకరు చనిపోయాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అతడు మానసికంగా కుంగిపోయాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి తాముంటున్న గది వరండాలో గోపాలకృష్ణ చాలాసేపు ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయాడని వేకువజామున చూడగా అతడు కనిపించలేదని అంటున్నారు. అన్నిచోట్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కనిపించకుండా పోయిన రెండు గంటల తర్వాత తనను క్షమించాలంటూ మిత్రులకు ఫోన్ మెసేజ్ పెట్టినట్టు చెబుతున్నారు. అక్కడి పోలీసులు వీడియో పుటేజ్‌లను పరిశీలించగా.. ఒక బ్రిడ్జి వద్ద కనిపించినట్టు తెలిపారు. ఫిబ్రవరిలో ఇంటికి వస్తానని రెండు రోజుల క్రితమే తనతో ఫోన్‌లో చెప్పాడని తండ్రి దుగ్గిన రామయ్య తెలిపారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అతని తండ్రి రామయ్య తల్లడిల్లుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ద్వారా ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, కలెక్టర్ కె.భాస్కర్, ఉన్నతాధికారులను రామయ్య కోరారు.
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
Published Tue, Jan 5 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement