కోళ్ల ఫాంలో పనిచేస్తున్న భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కవాగూడలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ కోళ్ల ఫాంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు కోళ్ల దాణాలో కెమికల్ కలిపి చల్లుతుండగా.. అపస్మారక స్థితిలో పడి మృతిచెందారు. కెమికల్ పీల్చడం వల్లే మృతిచెంది ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఆందోళన..
కాగా..మృతుల బంధువులు కోళ్లఫాం ఎదుట ఆందోళనకు దిగారు. శేఖర్, పార్వతమ్మ దంపతులను ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం చేయడం వల్లే మృతిచెందారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహరం చెల్లించాలని మృతదేహాలతో కోళ్ల ఫాం ఎదుట బైఠాయించారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న అదిరాల గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.