పోలాకి:‘మీ అభివృద్ధి మాకొద్దు... మమ్మల్నిలా బతకనీయండి... చిన్న గ్రామాలని మాపై కక్ష గట్టారా?... మమ్ము పురుగులకంటే హీనంగా చూస్తారా... వంశధార నిర్వాసితులకు పరిహారం ఎలాగిస్తున్నారో చూడటంలేదా... ఏం సోంపేట, కాకరాపల్లిలో జరిగిన సంఘటనలు మరచిపోయారా...’ అంటూ పోలాకి మండలంలోని థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంత ప్రజలు నిలదీశారు. కలెక్టర్‌ను, ఎమ్మెల్యేపైనా విరుచుకుపడ్డారు. అసలు తమకు ప్లాంట్ ఒద్దే ఒద్దని నినదించారు. దీంతో అధికారులంతా అక్కడినుంచి నిష్ర్కమించారు. వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని తోటాడ పరిసరప్రాంతాల్లో దాదాపు 2500 ఎకరాల్లో జపాన్‌కు చెందిన సుమిటోమో కంపెనీ పెట్టుబడులతో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. తొలుత కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవిభజన తరువాత పరిశ్రమలు అనివార్యమైన నేపధ్యంలో జిల్లా అభివృద్ధి జరగాలంటే ఇలాంటి ప్లాంట్లు అవసరమన్నారు. జిల్లాలో జపాన్ బృందం పరిశీలించిన నాలుగు ప్రాంతాల్లో పోలాకి అనువుగా వుండటంతో పాటు ఇక్కడ కేవలం 179 కుటుంబాలకే పునరావాసం కల్పిస్తే సరిపోతుందని అన్నారు. ఇక్కడి ప్రజలకు, రైతులకు మెరుగైన, సంతృప్తికరమైన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఒకప్రాంతప్రజలకు నష్టమే అయినప్పటికీ రాష్ట్ర అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ప్రజలుకూడా సహకరించి ప్లాంటు వద్దనటం కన్నా పరిహారం గూర్చి చర్చించుకోవాలని కోరడంతో ప్రజలంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎంపీపీ కరిమి రాజేశ్వరరావు, ప్రతిపాదిత ప్రాంత నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, సంపతిరావు రామన్న, పాగోటి అప్పారావు, కోట అప్పారావు తదితరులు మాట్లాడుతూ అసలు తమప్రాంతంలో ప్లాంటు నిర్మాణమే వద్దంటే పరిహారం గూర్చి మాట్లాడటం దారుణమని అన్నారు. తమ గ్రామాలకు వచ్చి తమ కడుపుకోత తెలుసుకోవాలని కోరారు. రైతులనుంచి తీసుకున్న భూములకు బదులుగా వేరే చోట భూములు ఇస్తారా..? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంటు నిర్మాణానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.
ధ్వజమెత్తిన ప్రజాసంఘాలు
జిల్లాలో ఇప్పటికే థర్మల్‌పవర్ ప్లాంట్‌లపై తీవ్రవ్యతిరేకతలు వ్యక్తమౌతున్నా ప్రభుత్వం మళ్ళీ దేశంలోనే అతిపెద్ద పవర్‌ప్లాంట్ జిల్లాలో చేపట్టాలని ఏకపక్షంగా పూనుకోవటంపై పలు ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్ సమక్షంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. నాయకులు తమ స్వార్థంకోసం జిల్లాను ప్రయోగశాలగా మార్చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారిని మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రజలు వారికి బాసటగా నిలిచి ధర్మల్‌ప్లాంటు వద్దంటే వద్దని నినాదాలు చేశారు. పరిస్దితి గమనించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయాలను పూర్తిగా వినకుండానే అక్కడినుండి నిష్ర్కమించారు.
అధికారపార్టీ అత్యుత్సాహం
మండలంలోని ప్రతిపాదిత గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమంలో ఆ గ్రామాలతో సంబంధంలేని అధికారపార్టీకి చెందిన కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు ముందుగా వచ్చి కుర్చీలపై తిష్టవేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు అభివృద్ధి మంత్రాలు జపిస్తుంటే ముందుగా చప్పట్లతో అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. అధికారపార్టీకి చెందిన నాయకుడు పల్లి సూరిబాబు అనుకూలంగా మాట్లాడటంతో ప్రతిపాదితప్రాంత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా మండిపడ్డారు.
ఓదిపాడు వద్ద కాన్వాయి అడ్డగింత
ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా జరగకపోయినా అధికారులు, నాయకులు థర్మల్‌ప్లాంటు ప్రాంతం పరిశీలనకు వచ్చారు. అక్కడ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతుండగా ఓదిపాడు, సన్యాసిరాజుపేట గ్రామాలకు చెందిన మహిళలు, వృద్ధులు కలెక్టర్ కాన్వాయికి అడ్డంగా వచ్చారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపైనా విరుచుకుపడ్డారు. అక్కడ కూడా పోలీసులు వారందనీ ప్రక్కకునెట్టి కాన్వాయి ముందుకుపోనిచ్చారు. జెన్‌కో ఈఈ కె.వి.వి.సత్యనారాయణమూర్తి, ఏడీఈ రాజ్‌కుమార్, శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, ఎంపీపీ తమ్మినేని లక్ష్మీభూషణ్‌రావు, తహశీల్దార్ రామారావు, ఎంపీడీఓ లక్ష్మీపతి, సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
థర్మల్ పవార్
Published Thu, Jul 9 2015 12:46 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement