న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు సజావుగా సాగని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించాలని పట్టుపడుతూ విపక్షాలు లోక్‌సభను స్తంభింపజేయడం విదితమే.
ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించేందుకుగాను స్పీకర్ ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళి అనంతరం వాయిదా పడిన లోక్‌సభ గురువారం సమావేశం కానుంది.
నేడు స్మోకింగ్ రూం పునఃప్రారంభం!
ధూమపాన ప్రియులైన ఎంపీలు పార్లమెంట్ భవనంలోనూ పొగ తాగేందుకు మళ్లీ వీలు కానుంది. పార్లమెంట్ భవనంలోని చరిత్రాత్మక సెంట్రల్ హాల్‌కు పక్కన పునరుద్ధరించిన స్మోకింగ్ రూంను నేడు(గురువారం) ప్రారంభించనున్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 21 నుంచి ఈ గదిని స్టెనోగ్రాఫర్ల కోసం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కేటాయించారు. అయితే, తమకు స్మోకింగ్ రూంను కేటాయించాలంటూ సమావేశాల ప్రారంభం రోజే అధికార, ప్రతిపక్ష సభ్యులు పలువురు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అది సెంట్రల్ హాల్‌కు సంబంధించిన గది అని, దానిని ఎంపీల అవసరాలకే వినియోగించాలని కోరారు. దీంతో స్టెనోగ్రాఫర్లకు మూడో అంతస్తులోని గదిని స్పీకర్ కేటాయించారు. కాగా, 2004లో పార్లమెంట్ హౌస్, సెంట్రల్ హాల్, లాబీలను నో స్మోకింగ్ జోన్‌గా ప్రకటించారు. అప్పుడే ఎంపీలు పొగతాగేందుకు ప్రత్యేక గదిని కేటాయించారు.
నేడు అఖిలపక్ష సమావేశం
Published Thu, Jul 30 2015 1:21 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM
Advertisement