
భారీగా టర్కీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: టర్కీ దేశపు కరెన్సీని చౌకగా ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకుని, వారి నుంచి పెద్ద మొత్తంలో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివీ..టర్కీ దేశంలో ప్రస్తుతం వాడుకలో లేని, ఆ దేశ కరెన్సీ ‘లిరా’ కరెన్సీ నోట్లను వివిధ అక్రమ మార్గాల్లో ముఠా సేకరించింది. వాటికి ఎంతో విలువ ఉందంటూ మోసాలకు పాల్పడుతోంది..దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం లాలాగూడచెందిన కృష్ణమోహన్ ఇంట్లో సమావేశమై ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, కృష్ణమోహన్ అనే వ్యక్తి మల్కాజిగిరి ప్రాంతం జ్యోతినగర్‌లోని ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
పట్టుబడిన వారి నుంచి 198 లిరా నోట్లు(సుమారు 220 కోట్ల విలువ), ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2005కు ముందు ముద్రితమైన ఈ లీరా నోట్లు ప్రస్తుతం ఆ దేశంలో వాడుకలో లేవు. ఒక్కో నోటు విలువ మన కరెన్సీలో రూ.5 లక్షలుండేది. నిందితులను, కరెన్సీని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో రాజమండ్రికి చెందిన పెదపూడి సత్యకుమార్, వీరవెంకట సుబ్రమణ్యం, విజయవాడ వాసులు కొండవీటి రంజిత్‌కుమార్, రూప్ చంద్, బందరు మండలం బూదలపాలెంనకు చెందిన టి.శ్రీనివాసరావు, సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన కృష్ణమ్మోహన్, వెంకట చలపతి రెడ్డి ఉన్నారు. ఈ ముఠా సభ్యుడు, ఖమ్మం జిల్లా వాసి అనిల్ కుమార్ పరారయ్యాడు.