కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండ ల కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలోని గడిమామిడి సమీపంలో (తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు) ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసు వర్గాల కథనం మేరకు.. మావోయిస్టుల కదలికలు పసిగట్టిన గ్రేహౌండ్స్ దళాలు మూడు రోజులుగా పుట్టకోట నుంచి కాకులమామిడి వరకు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆదివారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ కమెండోలు కాల్పులు జరపడంతో గస్తీ కాస్తున్న ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు కాల్పులు జరుపుతూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
చనిపోయిన మావోయిస్టుల నుంచి రెండు డీబీబీఎల్ తుపాకులు, ఒక కిట్‌బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవులకోట నుంచి పుట్టకోట వరకు సుమారు 50 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతదేహాలకు సోమవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి లేదా తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది. మృతదేహాలను తరలించే ర హదారుల్లో మావోయిస్టులు మందుపాతరులు అమర్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్లో పశ్చిమ డివిజన్ కార్యదర్శి చలపతి, రవి, ఆజాద్ వంటి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై నర్సీపట్నం ఓఎస్‌డీ అట్టాడ బాపూజీ ఆదివారం సాయంత్రం ‘సాక్షి’ విలేకరితో మాట్లాడుతూ.. గడిమామిడి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించిన విషయాన్ని ధ్రువీకరించారు. అయితే చనిపోయింది ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాలను ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
Published Mon, Feb 22 2016 4:01 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement