‘ఓటుకు కోట్లు’పై ‘బాబు’ వ్యూహరచన!
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఓటుకు కోట్లు’ కేసు సీఎం చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని గట్టిగా ప్రశ్నించవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీపార్టీ(టీడీపీపీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు దాదాపు 3 గంటలపాటు జరిగే ఈ భేటీలో ఓటుకు కోట్లు అంశమే ప్రధాన చర్చనీయాంశంగా కనిపిస్తోంది. సమావేశానికి బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు ఆడియో టేపులు టీవీ చానళ్లలో ప్రసారమవడం తెలిసిందే. ఈ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినట్లూ వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్లమెంటులో ఈ అంశంపై గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయని టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈ అంశాన్ని ఎదుర్కొనే విషయంలో టీడీపీపీ సమావేశంలో తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఆ మేరకు తెలంగాణ సర్కారు తమ ఫోన్లు ట్యాప్ చేసిందనే ఎత్తుగడతో ఈ అంశాన్ని ఎదుర్కొనాలని సూచించనున్నట్టు తెలిసింది. ఇందుకు మిత్రపక్షమైన బీజేపీ సాయం కూడా కోరాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
ఇదిలాఉండగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చినవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి అధిక నిధులు రాబట్టుకోవడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. 2014 సెప్టెంబర్ 20న విజయవాడలో జరిగిన టీడీపీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ప్రతినెలా రాష్ట్రంలోని ఏదో ఒకప్రాంతంలో సమావేశమై అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించుకోవాలని అప్పట్లో ఎంపీలు నిర్ణయించారు. విశాఖ-చెన్నై కారిడార్ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా, విశాఖ, తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలకు కేంద్రం భారీ నిధులందించేలా ఒత్తిడి తేవాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.
నూతన రాజధానికోసం అధికమొత్తంలో నిధులు రాబట్టే మార్గాలపైనా చర్చించారు. అయితే ఆ సమావేశం ముగిశాక ఈ అంశాలపై మరోసారి చర్చించడంగానీ, కేంద్రంపై ఒత్తిడి తేవడంగానీ జరగలేదు. ప్రత్యేక హోదాపైనా అధికారపార్టీ ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. ప్రత్యేక రైల్వేజోన్, కొల్లేరు కాంటూరు కుదింపు, మెట్రోరైలు ఏర్పాటు, విమానాశ్రయాలకు నిధులు, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు వంటి విషయాలను కేంద్రంవద్ద ప్రస్తావించి వాటికోసం తీవ్రస్థాయిలో పట్టుబట్టిన సందర్భాలూ కరువే.