Parliament Conferences
-
‘ఓటుకు కోట్లు’పై ‘బాబు’ వ్యూహరచన!
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఓటుకు కోట్లు’ కేసు సీఎం చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని గట్టిగా ప్రశ్నించవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీపార్టీ(టీడీపీపీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు దాదాపు 3 గంటలపాటు జరిగే ఈ భేటీలో ఓటుకు కోట్లు అంశమే ప్రధాన చర్చనీయాంశంగా కనిపిస్తోంది. సమావేశానికి బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు ఆడియో టేపులు టీవీ చానళ్లలో ప్రసారమవడం తెలిసిందే. ఈ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినట్లూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్లమెంటులో ఈ అంశంపై గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయని టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈ అంశాన్ని ఎదుర్కొనే విషయంలో టీడీపీపీ సమావేశంలో తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఆ మేరకు తెలంగాణ సర్కారు తమ ఫోన్లు ట్యాప్ చేసిందనే ఎత్తుగడతో ఈ అంశాన్ని ఎదుర్కొనాలని సూచించనున్నట్టు తెలిసింది. ఇందుకు మిత్రపక్షమైన బీజేపీ సాయం కూడా కోరాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చినవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి అధిక నిధులు రాబట్టుకోవడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. 2014 సెప్టెంబర్ 20న విజయవాడలో జరిగిన టీడీపీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ప్రతినెలా రాష్ట్రంలోని ఏదో ఒకప్రాంతంలో సమావేశమై అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించుకోవాలని అప్పట్లో ఎంపీలు నిర్ణయించారు. విశాఖ-చెన్నై కారిడార్ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా, విశాఖ, తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలకు కేంద్రం భారీ నిధులందించేలా ఒత్తిడి తేవాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. నూతన రాజధానికోసం అధికమొత్తంలో నిధులు రాబట్టే మార్గాలపైనా చర్చించారు. అయితే ఆ సమావేశం ముగిశాక ఈ అంశాలపై మరోసారి చర్చించడంగానీ, కేంద్రంపై ఒత్తిడి తేవడంగానీ జరగలేదు. ప్రత్యేక హోదాపైనా అధికారపార్టీ ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. ప్రత్యేక రైల్వేజోన్, కొల్లేరు కాంటూరు కుదింపు, మెట్రోరైలు ఏర్పాటు, విమానాశ్రయాలకు నిధులు, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు వంటి విషయాలను కేంద్రంవద్ద ప్రస్తావించి వాటికోసం తీవ్రస్థాయిలో పట్టుబట్టిన సందర్భాలూ కరువే. -
మళ్లీ ఉద్యోగుల సమైక్య సమరం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటుకు రానుండడంతో.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈనెల 6వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు విధులకు స్వస్తి పలకనున్నారు. 17, 18 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ సమైక్య రాష్ట్ర ఆవశ్యకత వివరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్జీఓ అసోసియేషన్ హాలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కార్యకర్గం అత్యవసరంగా సమావేశమైంది. జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రస్తుతం సమైక్య పోరాటం ఆఖరి దశకు చేరుకుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ స్వాములు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులంతా కేంద్రానికి తమ నిరసన తెలియజేయాలని వైద్య ఆరోగ్యశాఖ నాయకుడు కే శరత్‌బాబు కోరారు. రాష్ట్రం విడిపోతే తలెత్తే నీటి సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్నాసర్ మస్తాన్‌వలి అన్నారు. సమావేశంలో కో ఆపరేటివ్ ఉద్యోగల సంఘం జిల్లా అధ్యక్షుడు కే వెంకటేశ్వరరెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ నాయకులు ఎం. మూర్తి, పీ మదన్మోహన్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి పీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగుల వివిధ సంఘాల నాయకులు గోపాల్, ఐసీహెచ్ మాలకొండయ్య, పీ రమేష్, బీ ఏడుకొండలు, సురేష్, రాజశేఖర్, కే శివకుమార్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఏం చేస్తాయో? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గత ఏడాది నిర్వహించిన అరవై ఆరు రోజుల నిరవధిక సమ్మెలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. వీరి రాకతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అయితే ఈ దఫా ఆ రెండు శాఖల నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు.