చెరకు రైతులను ఆదుకుంటాం
పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: చెరకు రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలనూ సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. చక్కెర శాఖలో రైతులకు నష్టం కలిగే విధంగా వ్యవహరించిన అధికారులను, ఉద్యోగులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శెక్కర్ భవన్‌లో శుక్రవారం మంత్రి శాఖలోని వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.
షుగర్ కమిషనర్ బధ్రు మాలోత్‌తో పాటు ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరైన ఈ సమావేశంలో శాఖాపరంగా జరుగుతున్న నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలను అధికారులు, ఉద్యోగులు పూర్తిగా భ్రష్టు పట్టించారని, చక్కెర అమ్మిన డబ్బులను చెరకు రైతులకు చెల్లించకుండా మిగతా స్టాక్‌ను విక్రయిస్తూ నష్టం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు, ఉద్యోగుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
సమీక్ష అనంతరం మీడియాతో జూపల్లి మాట్లాడుతూ ‘నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్) కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా లావాదేవీలకు సంబంధించి సరైన లెక్కలు లేవు. చెరకును క్రష్ చేసిన తరువాత వచ్చిన చక్కెర అమ్మకం డబ్బును రైతులకు చెల్లించడం లేదు. ఈ కంపెనీ యాజమాన్యం 80 వేల క్వింటాళ్ల చక్కెర విక్రయించి బ్యాంకుకు మాత్రం రూ. 10 కోట్లు కట్టింది. మిగతా రూ. 26 కోట్లు ఇతరత్రా వాడడం జరిగింది’ అని అన్నారు.
షుగర్ కమిషన్ కింద ఎన్‌డీఎస్‌ఎల్‌లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు, కమిషనర్ బాధ్యతగా వ్యవహరించి చక్కెర అమ్మగా వచ్చిన డబ్బును రైతులకు చెల్లించేలా చూడాలని అన్నారు. చెరకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రూ. 11 కోట్లు రైతాంగానికి ఇచ్చారని, అయినా ఇంకా కొంత బకాయిలు ఉన్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ఇచ్చే ధర రూ. 2,200 అయితే అదనంగా రూ. 400 కలిపి రూ. 2,600 రైతాంగానికి చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బోధన్, సంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లను మంత్రి మందలించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కేన్ కమిషనర్ వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.