హైదరాబాద్: పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకు నిరసనగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల ఎదుట ఆందోళనలు చేపట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు.
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
గుంటూరు: జిల్లాలో పెరిగిన ధరలకు నిరసనగా జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరి పేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
విజయనగరం: వైఎస్ఆర్ సీపీ నేత బేబినాయన ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసరాల ధరలకు నిరసనగా బొబ్బిలిలో ధర్నా చేశారు.
వైఎస్ఆర్ కడప: నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఆందోళన చేపట్టింది. జిల్లాలోని కమలాపురంలో పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.
పశ్చిమగోదావరి: నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. సోమవారం పాలకొల్లులో పార్టీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో దాచిరాజుకు వినతిపత్రం సమర్పించారు.