హైదరాబాద్: ప్రత్యేక హోదాపై నోరు విప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో పార్టీ శ్రేణులు నిరసన వక్య్తం చేశారు. పలు జిల్లాల్లో నిరసన తెలుపుతున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
కడప: జిల్లాలోని రాజంపేటలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ దర్నాలో మార్కెట్ కమిటీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి , పోలా శ్రీనివాసుల రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
కర్నూలు: ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడపోవడంతో జిల్లాలోని మద్దికెరలో ఆయన దిష్టిబొమ్మను వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు దహనం చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం: జిల్లాలోని ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ క్రమ శిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.
విజయనగరం: ప్రత్యేక హోదా కోసం ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటే ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టి వెళ్లారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ గడ్డాపు ఉదయభాను అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తీరును నిరసిస్తూ జిల్లాలోని పార్వతీపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలసి ఆయన నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. మోదీ, చంద్రబాబులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కృష్ణా : ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని, సీఎం తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణా జిల్లా లో నిరసనలకు దిగారు. నందిగామ పట్టణంలో నాయకులు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ గాంధీ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.