
సాక్షి, హైదరాబాద్: కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన‍్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు. దీంతో మాధవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
కూతుర్ని చూడాలని ఉందని చెప్పి మరీ కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై పాశవికంగా దాడిచేయడం కలకలం రేపింది. బోరబండకుచెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్ సెప్టెంబర్ 12న బోయిన్‌పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని తండ్రి మాధవిపై వేటకొడవలితో అతి దారుణంగా దాడిచేసాడు. మెడపైన, చేతిపై తీవ్ర గాయాలు కావడంతో సోమాజగూడలోని యశోద ఆసుపత్రిలో మాధవి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెడ నరాలు బాగా దెబ్బతిన్నాయనీ, రెండు మూడరోజు గడిస్తే తప్ప ఏమీచెప్పలేమని వైద్యులు ప్రకటించారు. అటు సందీప్ పరిస్థితి కూడా నిలకడగానే ఉంది.
అమ్మాయిని చూడాలని పిల్చి మరీ హత్యాయత్నం చేశారని అబ్బాయి స్నేహితుడు ఒకరు తెలిపారు. చంపేద్దామనే వచ్చారనీ, అయితే సందీప్ తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు. మరోవైపు సందీప్‌కు తండ్రి లేడు. తల్లి కష్టపడి సందీప్‌ను పెంచి పెద్ద చేసిందనీ, పెళ్లి తరువాత ఇద్దరూ సందీప్ ఇంటివద్దనే ఉంటున్నారని తెలిపారు. వీరికి న్యాయం చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పెళ్లి జరిగిన వారం రోజుల్లోపునే ఈ హత్యాయత్నం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు మండిపడుతున్నారు. కులాంతర వివాహమే ఈ దాడికి కారణమై ఉండవచ్చని ప్రాథమింగా పోలీసులు అంచనావేశారు. ఇది ఇలా ఉంటే నిందితుడు, మాధవి తండ్రి మనోహరాచారి పోలీసులకు ముందు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment