సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ కుట్రకు రెండు నెలల క్రితమే పథకం రచించినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించారని విచారణలో నిందితులు అంగీకరించారు. హేమంత్, అవంతి కలుసుకోకుండా.. లక్ష్మారెడ్డి క్రూరంగా వ్యవహరించినట్టు తెలిసింది. పెళ్లికి ముందు తనను నెలలు నిర్బంధంలో ఉంచారని అవంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. (చదవండి: హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత)
అప్పట్లో మిస్సింగ్ కేసు
విచారణలో వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. హేమంత్‌ని కలుసుకోకుండా లక్ష్మారెడ్డి ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు. జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో హేమంత్‌కి కాల్ చేసిన అవంతి, అతనితో కలిసి బైక్ పైన పారిపోయింది. అయితే ఆ సమయంలో పవర్ లేకపోవడం, సీసీ కెమెరాల్లో రికార్డ్ కాకపోవడంతో.. అవంతి తల్లిదండ్రులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ నమోదైంది. ఆ తరువాత రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పోలీసులు పంపించేశారు. తర్వాత హేమంత్, అవంతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అదే పగతో రగిలిపోతున్న అవంతి తల్లి, హేమంత్ హత్య చేయడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది.
కాగా, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసులో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా, మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో కేసులో లోతైన దర్యాప్తు కోసం నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఆధారాలతో సహా విచారణ చేయాలని భావిస్తున్నారు. ఇక జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేయాలనీ భావిస్తున్నారు.
హంతకుల ఇళ్ల వద్ద రక్షణ
ఇక హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అవంతి తరుపు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర మీడియాకు తెలిపారు. హంతకుల ఇంటి వద్ద పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని, బాధితుల ఇంటి దగ్గర పోలీసులు లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అవంతి, హేంమంత్ సోదరుడు సుమంత్, అతని స్నేహితులు ఆందోళనకు దిగారు. హేమంత్ ఇంటినుంచి లక్ష్మారెడ్డి ఇంటివైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చందానగర్‌లో కొంత ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య)
Comments
Please login to add a commentAdd a comment