సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్ భార్య అవంతి, సోదరుడు సుమంత్, సీపీఐ నారాయణ పాల్గొన్నారు.
ఈక్రమంలో హేమంత్ ఇంటినుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, చందానగర్‌కు చెందిన అవంతిరెడ్డి, హేమంత్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా.. అవంతి తల్లిదండ్రులు హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించారు. అవంతి మేనమామ యుగేందర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటికే 14 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువకపముందే.. హేమంత్ హత్య సంచలనంగా మారింది.
(చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య)
వైఫల్యం కనిపిస్తోంది
‘జస్టిస్ ఫర్ హేమంత్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment