ప్రవీణ్ (ఫైల్)
సాక్షి, చైన్నె: తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఓ అన్న తన స్నేహితులతో కలిసి హతమార్చాడు. ఈ పరువు హత్య చైన్నె శివార్లలో కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని పళ్లికరణై పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. స్థానిక అంబేడ్కర్ వీధికి చెందిన ప్రవీణ్(26) ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఎలిటియన్ పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈ ప్రేమ జంట గత ఏడాది చివర్లో ఇంటి నుంచి పారిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు.
తమ కుటుంబ పరువును బజారు కీడ్చిన ప్రవీణ్‌పై ఆ యువతి కుటుంబం కక్ష పెంచుకుంది. ఆమె సోదరుడు దినేష్(24) తన మిత్రులతో కలిసి ప్రవీణ్ కదలికలపై నిఘా పెట్టాడు. శనివారం రాత్రి వేళచ్చేరి నుంచి పళ్లికరణై టాస్మాక్ రోడ్డు వైపుగా వెళ్తున్న ప్రవీణ్‌ను దినేష్ తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి పడేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న దినేష్‌ను ఆ పరిసర వాసులు 108లో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరణించినట్టు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పళ్లికరణై ఇన్‌స్పెక్టర్ నెడుమారన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అతడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించింది. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పారి పోయిన మార్గంలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయాన్నే దినేష్‌తో పాటు అతడి స్నేహితులు చిత్తాల పాక్కం శ్రీరాం(23), స్టీఫన్(24), విష్ణు రాజు(23), జ్యోతిలింగం(23) మాంబాక్కం వద్ద ఓ చోట తలదాచుకుని ఉండడంతో వారిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తన చెల్లెల్ని కులాంతరం వివాహం చేసుకున్నందుకే ప్రవీణ్‌ను మట్టుబెట్టినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment