తమిళనాడు: తిరుపూర్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య (19). పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్ (19). డిప్లమో చదివాడు. చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేటు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ గత డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమై ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2వ తేదీన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో పంపారు. ఈ స్థితిలో గత 3వ తేదీన ఐశ్వర్యని ఆమె తండ్రి, బంధువులు కొట్టి వేధించి హత్య చేసి దహనం చేసినట్లు నవీన్‌కు అతని స్నేహితులు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఒరత్తనాడుకు వచ్చిన నవీన్ ఈ విషయాన్ని వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెయ్‌వడుతి, పూవలూరు గ్రామంలో బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు.
మృతదేహాన్ని దహనం చేసిన తరువాత బూడిద కూడా లేకపోవడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, భార్య రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, అతని సోదరి అగదాసి, 16 ఏళ్లబాలిక సహా 11 మందిని అరెస్టు చేసి విచారణ కోసం వట్టతిక్కోట్టై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment