
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్, బైసన్‌పోలో గ్రౌండ్‌ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన వివాదం పెండింగ్‌లో ఉండటంతో, ఆ బదలాయింపును పక్కన పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను త్వరగా విచారించాలని అభ్యర్థించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. ఈ నెల 29న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ రోజున విచారించే కేసుల జాబితాలో ఈ కేసులను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
బైసన్‌పోలో, జింఖానా మైదానాలను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసింహలతో మరో ఇద్దరు హైకోర్టులో గతేడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై జి.కరుణాకర్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. గురువారం ఈ వ్యాజ్యాల గురించి అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యాజ్యాలపై త్వరగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ నెల 29న విచారణ జరుపుతామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment