
సాక్షి, హైదరాబాద్: సచివాలయం సమీపంలోని ప్రైవేటు భవనాల్లోకి మీడియాను అనుమతించరాదంటూ సదరు భవనాల యజమానులను పోలీసులు బెదిరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారాలు చట్టబద్ధమైనప్పుడు ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించింది. ప్రైవేటు భవనాల యజమానులు మీడియాను అనుమతించేందుకు సిద్ధంగా ఉంటే పోలీసులు గానీ, ప్రభుత్వంగానీ అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం భవనాల కూల్చివేతకు మీడియాను అనుమతించడం లేదంటూ వీఐఎల్ మీడియా లిమిటెడ్ తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మరోసారి విచారించారు. కూల్చివేత ప్రాంతానికి మీడియాను అనుమతించేందుకు సిద్ధంగా లేమని, అవసరమైతే కోవిడ్ కేసుల బులెటిన్ ఇస్తున్న తరహాలో మీడియా బులెటిన్ ఇస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు.
జీవో 69 ప్రకారం కూల్చివేత ప్రాంతానికి ఎవరినీ అనుమతించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను దురుద్దేశంతో వేశారని, దీనికి విచారణార్హత లేదని వాదించారు. కూల్చివేతల సమయంలో ప్రమాదం జరగకూడదనే మీడియాను అనుమతించడం లేదన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి నవీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్ కేసులకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టి బులెటిన్ విడుదల చేస్తున్నారని, ఇదే తరహాలో కూల్చివేతలకు సంబంధించిన బులెటిన్ ఉంటుందని, ఇందుకు తాము అంగీకరించమని తెలిపారు. ప్రతిరోజూ మీడియాను ఏదో ఒక నిర్దిష్ట సమయంలో సచివాలయం ప్రాంగణంలోకి తీసుకెళ్లేలా ఆదేశించాలని కోరారు. ‘మీడియా ప్రతినిధులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ నేతలను ఇంటర్వ్యూ చేస్తారు. రిస్క్ చేయడం వారి విధి నిర్వహణలోనే ఉంది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికిది మంచిది కాదు..
‘సచివాలయం కూల్చివేతకు హైకోర్టు, సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతించాయి. కూల్చివేతలకు అనుమతి అవసరం లేదని, నూతన భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి అవసరమని స్పష్టం చేశాయి. ఈ తరుణంలో శిథిలాలను చూడటానికి మీడియాను అనుమతించడానికి అభ్యంతరం ఏమిటి? జాతీయ మీడియా సైతం ఆసక్తిగా ఈ అంశాన్ని ప్రచురిస్తోంది. మీడియాను నియంత్రించి అనవసరమైన అపోహలకు ఆస్కారం ఇస్తున్నారు. గుప్తనిధులున్నాయి కాబట్టే మీడియాను అనుమతించడం లేదని భావిస్తున్నారు. మంచి భవిష్యత్ ఉన్న ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. పారదర్శకంగా ఉండాలి. ఏదో ఒక సమయంలో మీడియాను ఒక వ్యాన్‌లో తీసుకెళ్లి చూపిస్తారని భావించాను. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేమని చెబుతోంది కాబట్టి దీనిపై ఇరు వర్గాల వాదనలు విని తీర్పు వెలువరిస్తాం..’అంటూ న్యాయమూర్తి విచారణను శనివారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment