నయీం కేసులో మరో పదిమంది అరెస్టు
హైదరాబాద్: నయీం కేసులో మరికొన్ని అరెస్టులు జరిగాయి. నయీంతో కలిసి భువనగిరి ప్రాంతంలో కిడ్నాప్లు, బలవంతపు భూముల రిజిస్ట్రేషన్లకు, ఆయుధాల సేకరణ వంటి చర్యలకు పాల్పడిన పదిమందిని సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల పోలీసులు అరెస్టు చేయగా, మిగితా తొమ్మిదిమందిని నల్లగొండ జిల్లాలోని భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు.
పూత బాలకిషన్, ఎండీ అఖిల్ పాషా, రాపోలు సుదర్శన్, జూకంటి బుచ్చయ్య, ఎండీ ఖాసీంసాబ్, సుధాకర్, వెంకటేశ్ అడ్వకేట్, శ్రీనివాస్, శ్రీధర్ రాజు, మహ్మద్ అష్రప్(నయీం బావమరిది)ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాశం శ్రీనివాస్ తో సహా మొత్తం తొమ్మిదిమంది నయీంతో పనిచేస్తూ కిడ్నాప్లు, ఆయుధాల సేకరణ, బలవంతపు భూకబ్జాలకు భువనగిరి పట్టణంలో పాల్పడేవారని చెప్పారు. వీరితో కలిపి ఇప్పటి వరకు నయీం కేసులో అరెస్టయిన వారి సంఖ్య మొత్తం 77కు చేరింది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం నయీంకు సంబంధింది 72 కేసులు నమోదయ్యాయి. ఇంకొంతమంది నేరస్తులను అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొనసాగిస్తున్నారు.