వచ్చే మే దాకా 100 టీఎంసీలు!
- కృష్ణా నీటి అవసరాలపై పూర్తయిన కసరత్తు
- రబీకి 90 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు
- నేడో, రేపో బోర్డుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మే వరకు కృష్ణా జలాల అవసరాలపై రాష్ట్రం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మళ్లీ వర్షాకాలం ఆరంభమయ్యే వరకు రాష్ట్ర సాగు, తాగు అవసరాలకు మొత్తంగా 100 టీఎంసీల కృష్ణా నీరు అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో రబీ అవసరాలకే 90 టీఎంసీల మేర కేటాయించాలని నిర్ణయించగా.. మరో 10 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డుకు ప్రతిపాదనలు పంపనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 6.40 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఏఎంఆర్‌పీ కింద నల్లగొండ జిల్లాలో చెరువులు నింపడంతోపాటు జిల్లా తాగునీటి అవసరాలు తీర్చాలని సంకల్పించింది. అలాగే నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా కింద సాధ్యమైనంత ఎక్కువగా సాగు నీరివ్వాలని భావిస్తోంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి లెక్కలను రూపొందించింది.
25 లక్షల ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరున్న దృష్ట్యా ప్రస్తుత రబీలో సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ(శివమ్) నిర్ణయించింది. ఇందులో భారీ ప్రాజెక్టుల కింద 21.09 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3.22 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఆయకట్టు, కెనాల్స్, ఫీల్డ్ చానల్స్ తదితర అంశాలపై బుధవారం జలసౌధ కార్యాలయంలో శివమ్ కమిటీ సమీక్ష జరిపింది.