సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 111 జీవోను సవరిస్తే రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని నీటి పారుదలశాఖ తేల్చిచెప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 86 గ్రామాలను జీవ పరిరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీచేసింది. జంటనగరాల దాహార్తిని తీర్చే ఈ జలాశయాలకు వరద నీరు సులువుగా చేరాలంటే అంక్షలు తప్పనిసరని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని 86 గ్రామాలను 111 జీవో పరిధిలోకి తెచ్చింది.
అయితే, తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందని, దీన్ని సవరించాలని చాలా ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినందున.. గత పాలకులు దీనిని సవరించే ందుకు సాహసించలేదు. ఒకవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకుని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌస్‌లను నెలకొల్పుకున్నారు.
సవరణ కుదరదు
111 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున.. జీవో ఎత్తివేత , సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాస్త్రీయత పాటించకుండా అప్పట్లో జీవో జారీ చేశారని, దిగువ ప్రాంతాలపై కూడా ఆంక్షలు విధించారనే ఆరోపణలున్నందున.. అవి నిజమైతే కనీసం ఆ గ్రామాలకైనా జీవోనుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భావించారు. శాసనసభ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు.
ఈ మేరకు సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న జిల్లా కలెక్టర్... బయో కన్జర్వేషన్ జోన్‌ను పునఃసమీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో ప్రత్యేక సర్వే చేయించారు. 111 జీవో వర్తింపజేస్తున్న 86 గ్రామాలు జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయని, శాస్త్రీయంగానే ఈ గ్రామాలపై ఆంక్షలు విధించారని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఏ మాత్రం అంక్షలు సడలించినా.. ఈ జలాశయాల ఉనికి దెబ్బతింటుందని తెగేసి చెప్పింది. ఈ మేరకు తమకు నివేదిక అందజేసినట్లు జిల్లా ముఖ్యఅధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు.
111 జీవో కరెక్టే!
Published Wed, Sep 24 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement