128 మంది లెసైన్సులు రద్దు
♦ మందు బాబుల వివరాలతో ఆర్టీఏకు సిఫార్సు
♦ ‘డ్రంకెన్ డ్రైవ్’ డేటా బేస్ రూపొందించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ కేసులపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జరి మానా, కౌన్సెలింగ్, జైలు శిక్ష వంటివి అమలు చేస్తున్న పోలీసులు... డేటాబేస్ ఆధారంగా పదేపదే మద్యం తాగుతూ చిక్కిన వారిలో 128 మంది డ్రైవింగ్ లెసైన్స్‌లు మూడు నెలల పాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతూ సోమవారం ఆర్టీఏకు లేఖ రాశారు. సస్పెన్షన్‌కు గురైన లెసైన్స్‌తో డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కోర్టు ద్వారా జైలుకు పంపాలని నిర్ణయిం చారు. నిత్యం చిక్కుతున్న వారి వివరాలతో ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్’ రూపొందించి, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ డేటాబేస్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు వినియోగిస్తున్న పోర్టబుల్ డివైజ్ అప్లికేషన్ (పీడీఏ)తో ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయి ఉంటుంది. పట్టుబడిన వాహనదారుడు ఎన్నిసార్లు మ ద్యం సేవించాడన్న విషయం క్షేత్ర స్థాయిలో సులువుగా తెలుసుకొనే వీలుంటుంది.
మళ్లీ చిక్కితే జైలుకే: మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం మొదటిసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా ఆరు నెల ల జైలు శిక్ష లేదా రూ.2వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అదే వాహన చోదకుడు మూడేళ్ల లోపు మరోసారి ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే... రూ.3వేల జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. ఇలా ‘రిపీటెడ్ అఫెండర్ల’కు చెక్ చెప్పేందుకే సెంట్రలైజ్డ్ డేటాబేస్ రూపొందించారు. ఇప్పటి వరకు న్యాయస్థానాలు మద్యం తాగిన మోతాదు, గతంలో చిక్కిన రికార్డుల ఆధారంగా జైలు శిక్షలు విధిస్తున్నాయి.
ఈ వివరాలను క్రోడీకరించిన ట్రాఫిక్ విభాగం అధికారులు 128 మంది వాహనచోదకులు ఒకటి కంటే ఎక్కువసార్లు మోతాదుకు మించి మద్యం సేవించి చిక్కినట్లు గుర్తించారు. వీరందరి డ్రైవింగ్ లెసైన్సుల సస్పెన్షన్ కోరుతూ ఆర్టీయేకు సిఫార్సు చేశారు. ఆర్టీఏ ఆమోద ముద్ర పడిన తరవాత ఆ సమాచారం వాహన చోదకుడికి సంక్షిప్త సందేశం రూపంలో అందుతుంది. ఈ వివరాలను ట్రాఫిక్ అధికారులు తమ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. తనిఖీల్లో రద్దయిన లెసైన్స్‌తో వాహనం నడుపుతున్న వ్యక్తుల్ని గుర్తిస్తే... వారిని శాంతిభద్రతల విభాగం అధికారులకు అప్పగించడంతో పాటు వాహనాన్నీ స్వాధీనం చేసుకుంటారు. ఆపై సదరు వాహన చోదకుడిని కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు.