ముగ్గురు కబ్జాదారుల అరెస్ట్ | 3 arrested for documents forgery | Sakshi
Sakshi News home page

ముగ్గురు కబ్జాదారుల అరెస్ట్

Published Sun, Sep 11 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

3 arrested for documents forgery

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో రూ.10 కోట్ల విలువ చేసే 1200 గజాల ఖరీదైన ప్లాట్‌కు అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు కబ్జాదారులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. దారుసలాంకు చెందిన అమృత్ కల్‌రేజా అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ప్లాట్ నెం.864 ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు స్కెచ్ వేశాడు.

ఇందులో భాగంగా తమ సమీప బంధువు బ్రిజేష్ కుమార్ బజాజ్, అనుచరుడు అస్గర్ అలీతో కలిసి శనివారం ఈ ప్లాట్‌లోకి వెళ్లి చుట్టూ గోడలు నిర్మించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ సొసైటీ కార్యదర్శి టి.హన్మంతరావు సొసైటీకి చెందిన ప్లాట్‌ను బోగస్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా స్థలంలో అమృత్ కల్‌రేజాతో పాటు బ్రిజేష్‌కుమార్ బజాజ్, అస్గర్ అలీలను అరెస్ట్ చేశారు.

వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 471, 427, రెడ్‌విత్ 34, సెక్షన్ 5ఆఫ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 1982లో ఈ ప్లాట్‌ను బ్రిజ్వేశ్వర్‌నాథ్ గుప్తాకు కేటాయించారు. అయితే సకాలంలో సభ్యత్వ రుసుము చెల్లించకపోవడంతో ఆయనకు ఇంకో ప్లాట్ కేటాయించారు. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగకముందే ఆయన మృతి చెందారు. బ్రిజ్వేశ్వర్‌నాథ్ కొడుకు రాజేంద్రనాథ్ 1999లో ఈ ప్లాట్ తనకు అలాట్ అయిందంటూ బోగస్ పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా.. అమృత్ ఈ ప్లాట్‌పై కన్నేశాడు. నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement