
ట్రాఫిక్ పోలీసులకు ఊరట!
జీతానికి అదనంగా 30 శాతం భత్యం మంజూరు
ఆమోదముద్ర వేసిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్
మూడేళ్ల క్రితమే ప్రతిపాదించిన సీవీ ఆనంద్
సీఐడీ, ఐఎస్‌డబ్ల్యూలకూ 25 శాతం కేటాయింపు
రోడ్లపైన, జంక్షన్లలో ఏకబిగిన కనిష్టంగా ఎనిమిది గంటల పాటు నిలువుకాళ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగాల్లో పని చేస్తున్న వారికి జీతంపై అదనంగా 30 శాతం పొల్యూషన్ పే ఇవ్వాలని ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ట్రాఫిక్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం నగర అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్)గా పని చేసిన సీవీ ఆనంద్ చేసిన ప్రతిపాదనలకు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)లో పని చేసే వారికి 25 శాతం అలవెన్స్ ఇవ్వనున్నారు. -సాక్షి, సిటీబ్యూరో
రాజధానిలోనే ఎక్కువ ప్రభావం...
రాజధానిలో కాలుష్యం నానాటికీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ఇవి వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్లు, సిగ్నల్స్ వల్ల ఆగుతున్న జంక్షన్లలో ఎక్కువగా ఉంటోంది. నగరంలో మొత్తం 585 ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణ (పాయింట్ డ్యూటీ)లో ఉంటున్నారు. అన్నిచోట్లా కాలుష్యం స్థాయి ఒకేలా ఉండట్లేదు. వాహన శ్రేణి, రాకపోకల సంఖ్య ఆధారంగా లెక్కిస్తే 125 జంక్షన్లలో అత్యంత తీవ్రంగా... మరో 200 జంక్షన్లలో తీవ్రంగా ఉంటోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికల ఆధారంగా ట్రాఫిక్ పోలీసుల ఈ గణాంకాలను రూపొందించారు. సిటీలో సంచరిస్తున్న వాహనాల్లో అన్నీ ఒకేస్థాయి కాలుష్యాన్ని విడుదల చేయట్లేదు. మొత్తమ్మీద అన్ని కేటగిరీలూ కలిపి 28 లక్షల వరకు వాహనాలు ఉండగా... అత్యంత కాలుష్య కారకాలుగా లక్ష వరకు ఉన్న ఆటోలు, 4 వేల ఆర్టీసీ బస్సులు నమోదవుతున్నాయి. వీటితో పాటు 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న వాహనాలు, ప్రభుత్వ, రవాణా వాహనాలు కూడా పరిగణలోకి తీసుకోదగ్గ స్థాయిలోనే కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. వీటికి తోడు ప్రమాణాలు పాటించని/ మోడ్రన్ హారన్లు, శక్తిమంతమైన లైట్లు శబ్ధ, కాంతి కాలుష్యాలకూ కారకాలవుతున్నాయి. వీటికి చెక్ చెప్పేందుకు అవసరమైన యంత్రాలు, యంత్రాంగం లేకపోవడంతో నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయి.
ప్రమాదపుటుంచుల్లో ట్రాఫిక్ సిబ్బంది....
ఈ పరిస్థితుల్లో పని చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వీరికి కనీసం నోస్ మాస్క్‌లు, కళ్లజోళ్లు వంటివీ అందుబాటులో ఉండేవి కాదు. అయితే గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఇవి అందుతూనే ఉన్నాయి. అయినప్పటికీ 2012 లో ట్రాఫిక్ సిబ్బందికి నిర్వహించిన సామూహిక వైద్య పరీక్షల ఫలితాలను విశ్లేషించిన సీవీ ఆనంద్ ఆందోళనకర అంశాలు గుర్తించారు. నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న వారిలో అనేక మంది ఊపిరితిత్తులు, కళ్లు, చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. సరాసరిన 32 శాతం మందికి ఊపిరితిత్తుల, 25 శాతం మందికి కంటి, ఏడు శాతం మందికి చెవి సంబంధ రుగ్మతలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అదనపు పే ఇప్పించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ సిబ్బంది నిత్యం కాలుష్యంలో పని చేస్తున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం వైద్య అవసరాలకు వినియోగించుకోవడం కోసం 30 శాతం అదనపు పే ఇప్పించాలంటూ సీవీ ఆనంద్ గతంలో పార్లమెంట్ స్థాయీ సంఘాన్ని కోరారు. వారు ఆమోదముద్ర వేయడంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిని పరిగణ లోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పుచేర్పులతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
‘లూప్‌లైన్స్’కు ప్రోత్సాహకంగా...
పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే అవినీతి నిరోధక శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతంపై అదనంగా 30 శాతం చెల్లించే విధానం అమలులో ఉంది. కీలక బాధ్యతలు నిర్వర్తించే సీఐ సెల్, ఆక్టోపస్‌ల్లోనూ అదనపు చెల్లింపు విధానం అమలవుతోంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక విభాగాలైన నేర పరిశోధన విభాగం (సీఐడీ), ప్రముఖల భద్రతను పర్యవేక్షించే ఐఎస్‌డబ్ల్యూలకూ 25 శాతం అదనపు భత్యం మంజూరు చేసింది. క్యాబినెట్ నిర్ణయంపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘పోలీసుల్లో నైతికస్థైర్యాన్ని నింపే ఈ నిర్ణయం అద్భుతమైంది. దీంతో పోలీసు పనితనంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కోసం ఉంటున్న ఒత్తిడి తగ్గిపోతుంది. దేశంలోనే తెలంగాణ పోలీసులు వారి సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యమంత్రి, హోమ్‌మంత్రి, డీజీపీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’. అన్నారు.