మూడోరోజు పోటెత్తిన భక్తజనం | 3rd day krishna pushkaralu! | Sakshi
Sakshi News home page

మూడోరోజు పోటెత్తిన భక్తజనం

Published Mon, Aug 15 2016 1:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

మూడోరోజు పోటెత్తిన భక్తజనం - Sakshi

మూడోరోజు పోటెత్తిన భక్తజనం

* పుష్కర స్నానమాచరించి పులకించిన భక్తులు
* ఆదివారం భారీగా తరలివచ్చిన వైనం

సాక్షి, అమరావతి/శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసి భక్తజనం పులకిస్తున్నారు. ఆదివారం, ఏకాదశి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలకు తరలి వచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పుష్కర ఘాట్లు భక్తజనంతో నిండిపోయాయి. కృష్ణా బ్యారేజీ పై భాగంలోని దుర్గ, పున్నమి, భవానీ, పవిత్ర సంగమం ఘాట్లతోపాటు బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో జనం పోటెత్తారు. మధ్యాహ్నం కాస్త పలుచబడినా సాయంత్రం తిరిగి భక్తుల రద్దీ పెరిగింది.

సాయంత్రం మూడు గంటలకు 24,55,908 మంది భక్తులు రాష్ట్రంలో పుష్కర స్నానాలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క విజయవాడలోనే ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు 9,24,169 మంది స్నానాలు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ మినహాయిస్తే మిగిలిన ఐదు ఘాట్లు రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లకు సమీపంలో ఉండటంతో భక్తులు నేరుగా నడుచుకుంటూ బ్యారేజీకి రెండు వైపుల ఉన్న ఘాట్‌లకు వెళ్తున్నారు. వీఐపీలు, పాస్‌లు ఉన్న వారి వాహనాలను నేరుగా ఘాట్ల వరకు అనుమతిస్తున్నారు.

ఆర్టీసీ బస్‌లు కూడా ఘాట్‌ల వరకు వస్తున్నాయి. పోలీసులు నిబంధనలు సడలించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దుర్గమ్మను చూసేందుకు క్యూలైన్లలో గంటల తరబడి నడవాల్సి వస్తోందని, దుర్గాఘాట్ ఎదురుగా ఉన్న క్యూలైన్ నుంచి లోపలికి పంపించాలని భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు గుడిపైకి పంపిస్తున్నారు. మూడో రోజు రాత్రి 7 గంటల వరకు దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు 1.60 లక్షల మంది ఉన్నారని ఆలయ అధికారులు తెలిపారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో భక్తులు ఎక్కువ మంది స్నానాలు చేశారు.
 
శ్రీశైలంలో ....
శ్రీశైలంలో రోప్‌వేను అనుమతించడంతో పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తుల సంఖ్య  పెరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదివారం తెల్లవారుజామున పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు పిండప్రదానం చేశారు. కాగా ఆదివారం నాడు సినీ ప్రముఖులు  నిర్మాత అశ్వనీదత్, హీరో వడ్డే నవీన్, సినీ నటుడు కృష్ణుడు మాత్రమే ఇంతవరకు పుష్కరాలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement