నాలుగు కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పంట పండుతోంది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రోజుకో ముఠా పట్టుబడుతోంది. తాజాగా మరో నాలుగు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా దుబాయి, మలేషియా, బ్యాంకాక్, థాయ్‌లాండ్, సింగపూర్, లండన్, అమెరికా దేశాల నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా దేశానికి తరలిస్తున్నాయి. వీటిలో కొన్ని ముఠాలు అధికారుల తనిఖీల్లో దొరికిపోతున్నాయి. కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి బంగారాన్ని రవాణా చేస్తే దేశ మార్కెట్‌లో కిలోకు రూ.5 లక్షల వరకు వీరికి గిట్టుబాటవుతుందని ఓ అంచనా.
అలాగే బంగారాన్ని తెచ్చి ఇక్కడి వ్యాపారులకు అందజేస్తే రూ.50 నుంచి 60 వేల వరకు కమీషన్ దొరుకుతుందని సమాచారం. దీంతో స్మగ్లర్లు అధికారుల కంటపడకుండా బంగారాన్ని తీసుకొచ్చేందుకు కొత్త పంథాలను అనుసరిస్తున్నారు. ఇటీవలే కొందరు పాప్‌కార్న్ యంత్రం, లోదుస్తుల్లో, బ్యాగు హ్యాండిల్, బ్యాగుల డిజైనింగ్ తీగలు, సెల్‌ఫోన్ కవర్‌లలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిపోతున్నారు.